దేశమంతా కరోనా లాక్‌డౌన్ అమలై అందరి ఉపాధిని దెబ్బతీస్తుంటే.. వారందరికీ దేవుడయ్యాడు బాలీవుడ్ నటుడు సోనూసూద్. ‘వదల బొమ్మాళి.. వదలా’ అంటూ రీల్ లైఫ్‌లా విలనిజం క్యారెక్టర్ వేసిన సోనూసూద్.. రియల్ లైఫ్‌లో మాత్రం హీరో అయ్యాడు. లాక్‌డౌన్‌లో ప్రజలు పడిన ఇబ్బందులు తీర్చిన గొప్ప నటుడు సోనూసూద్. ఇప్పుడు సోనూసూద్‌కు ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అంటూ లేదు. దేశమంతటా అభిమానులు ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఆయనకు దక్కే గౌరవం కూడా వేరు. అంతేకాదు.. ఆయన సాయం పొందిన వారంతా ఇప్పుడు ఆయన ఫొటోను పెట్టి పూజిస్తున్నారు.
ఓ వైపు అటు సినిమాలు తీస్తూనే.. సినిమా షూటింగుల్లో పాల్గొంటూనే.. ఇటు సామాజిక సేవను మాత్రం మరిచిపోవడం లేదు. ఒక్క లాక్‌డౌన్ కాస్త ఆయనలోని సేవాగుణాన్ని దేశమంతటికి చాటి చెప్పింది. కొన్ని చోట్ల ఆయనకు ఏకంగా గుడి నిర్మాణాలు చేపట్టారంటే ఆయన ఫేమ్ అర్థం చేసుకోవచ్చు. లైవ్‌గా కష్టాలు చూసి స్పందించడమే కాదు.. సోషల్ మీడియాలోనూ ఎవరైనా తన బాధలను పోస్ట్ చేస్తే చాలు.. వారి కష్టాలను సైతం తీర్చారు. ఇప్పుడు ఆయనను ఆదర్శంగా తీసుకొని చాలా మంది సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.
అంతటి పేరుప్రఖ్యాతలు సాధించిన ఈ రీల్, రియల్ లైఫ్ హీరో ఓ గమ్మత్తైన వీడియో పోస్ట్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాదు.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ వీడియోనే తెగ వైరల్ అవుతోంది కూడా.
ఇక అసలు విషయానికొస్తే.. సోనూసూద్ లాక్‌డౌన్ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. తెలుగు, హిందీ అంటూ తేడా లేకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే.. తాజాగా ఓ సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఆయన దోశలు వేయడం అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింటా సందడి చేస్తోంది. ఈ వీడియోపై సోను స్పందిస్తూ.. ‘‘యాక్టర్ కావాలంటే దోశలు వేయడం నేర్చుకోవాలి. అప్పుడే ప్రొడ్యూసర్ ఖర్చు కూడా తగ్గుతుంది. ఇక నాకు షూటింగ్ లేకున్నా కొంత మంది నన్ను పిలిపించుకొని మరీ నాతో దోశలు వేయించుకుంటున్నారు”అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.