ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా ఆగిపోయింది. అఫీషియల్ గా ఈ విషయం అనౌన్స్ అయ్యింది. అయితే.. ఉన్నట్టుండి జూనియర్ నిర్ణయం మార్చుకోవడం వల్ల ఇద్దరు హీరోలతోపాటు ఇద్దరు దర్శకులకు కూడా ఇబ్బంది వచ్చిందనే ప్రచారం సాగుతోంది. వాళ్లెవరు? ఎలాంటి ఇబ్బంది అన్నది చూద్దాం.
అలవైకుంఠ పురములో సినిమా తర్వాత ఏడాది కాలంగా ఎన్టీఆర్ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు త్రివిక్రమ్. కానీ.. ఇప్పుడు ఆయనతో సినిమా లేదని తేలిపోవడంతో సంవత్సర కాలం వృథా అయ్యిందనే భావనలో ఉన్నారట. దీంతో.. మహేష్ తో మూవీ ఫిక్స్ అవుతుందని, రేపోమాపో అనౌన్స్ మెంట్ కూడా రావొచ్చని అంటున్నారు.
మహేష్ తో త్రివిక్రమ్ మూవీ అంటే.. ముందు సర్కారువారి పాట పూర్తవ్వాలి. అది పూర్తయి, త్రివిక్రమ్ సినిమా మొదలై విడుదలయ్యే నాటికి ఏడాది కాలం పడుతుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత జక్కన్న మహేష్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబరులో ఆర్ ఆర్ ఆర్ ఈ సినిమా విడుదలైతే జక్కన్న ఫ్రీ. అంటే.. త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యే దాకా ఆయన వెయిట్ చేయాల్సిందే.
ఇటు ఎన్టీఆర్ తో కొరటాల శివ లైన్లోకి వచ్చాడు. నిజానికి ఆచార్య తర్వాత కొరటాల బన్నీని డైరెక్ట్ చేయాల్సి ఉంది. పుష్ప కంప్లీట్ అయిన తర్వాత వీరి సినిమా మొదలు కావాల్సి ఉంది. కానీ.. కొరటాల ఇటు రావడంతో.. అటు బన్నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది సందిగ్ధంలో పడింది.
ఈ విధంగా.. ఎన్టీఆర్ నిర్ణయం వల్ల ఇన్ని సినిమాలకు, ఇంత మందికి సమస్య వచ్చిందని అంటున్నారు. అయితే.. మరికొందరు మాత్రం ఇది మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తోనే జరిగిందని చెబుతున్నారు. ఎలా జరిగినా.. డిస్ట్రబెన్స్ వచ్చిందైతే మాత్రం వాస్తవం.