NTR Birthday: స్టార్ హీరోల అభిమానుల తీరు పలుమార్లు వివాదాస్పదం అవుతుంది. తమ హీరో మెప్పు పొందేందుకు, ఇతర హీరోల ఫ్యాన్స్ ముందు తాము గొప్పని నిరూపించుకునేందుకు దేనికైనా తెగిస్తారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కాగా అభిమానులు చేసిన పని విమర్శల పాలవుతుంది. కొందరు ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకునేందుకు పొట్టేలు తల నరికి, దాని రక్తంతో అభిషేకం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పలువురు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మీకు అంత అభిమానం ఉంటే మీ చేతులు, కాళ్ళు లేదా తలలు నరుక్కోండి… అమాయక జంతువులను బలి ఇవ్వడం దేనికి అంటూ మండిపడుతున్నారు.
ఎన్టీఆర్ అభిమానులు జంతు బలికి పాల్పడిన వీడియో వైరల్ అవుతుంది. అయితే అభిమానుల్లో మరో కోణం కూడా చూడాలి. ఇలాంటి అనుచిత కార్యక్రమాలతో పాటు మంచి పనులు సైతం చేస్తారు. ఎన్టీఆర్ జన్మదినం పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు అనేక సామాజిక కార్యక్రమాలు చేశారు. అన్నదానం, రక్తదానం వంటి శిబిరాలు నిర్వహించారు. పేదలకు వస్తువులు పంచడం వంటివి గొప్ప కార్యక్రమాలు చేపట్టారు.
ఇక ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం మాల్డీవ్స్ వెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యులతో మాల్దీవ్స్ వెళ్లాలని ఆయన ముందుగానే నిర్ణయించుకున్నారు. అందుకే ఎన్టీఆర్ శతజయంతి వేడుకకు ఎన్టీఆర్ హాజరుకాలేకపోయారు. ఎన్టీఆర్ తాత జయంతి ఉత్సవాల్లో పాల్గొనకపోవడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. పేరు, జీవితం ఇచ్చిన తాతయ్య కోసం ఎన్టీఆర్ టైమ్ కేటాయించలేకపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు. అదే సమయంలో మెగా హీరో రామ్ చరణ్ పాల్గొనడంతో ఆయన్ని లేపుతూ ఎన్టీఆర్ విమర్శిస్తున్నారు.
మరోవైపు ఎన్టీఆర్ బర్త్ డే అప్డేట్స్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చాయి. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర ఫస్ట్ లుక్ మెప్పించింది. ఎన్టీఆర్ ని గతంలో ఎన్నడూ చూడని గెటప్ లో కొరటాల ప్రజెంట్ చేశారు. దేవర ఫస్ట్ లుక్ అంచనాలు పెంచేసింది. దేవర 2024 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. నిరవధికంగా షెడ్యూల్స్ ప్లాన్ చేశారు. అలాగే ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీ వచ్చే ఏడాది మొదలు కానున్నట్లు తెలియజేశారు. అలాగే వార్ 2 సైతం 2024లో పట్టాలెక్కనుంది.