Sobhita Dhulipala revealed her secret: టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లిస్ట్ తీస్తే అందులో నాగ చైతన్య, శోభిత జంట కచ్చితంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ళ నుండి డేటింగ్ చేసుకుంటూ వచ్చిన ఈ జంట 2024 వ సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి బేధాభిప్రాయాలు లేకుండా చాలా సంతోషంతో వీళ్లిద్దరి దాంపత్య జీవితం కొనసాగుతూ ముందుకు వెళ్తోంది. ఇదంతా పక్కన పెడితే పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ్ల నటించిన ‘చీకట్లో’ అనే వెబ్ ఫిల్మ్ రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఈ సందర్భంగా ఆమె ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం.
ఆమె మాట్లాడుతూ ‘పెళ్ళైన తర్వాత ఇంట్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వంట చేయలేదు. పొరపాటున గ్యాస్ స్టవ్ వద్దకు వెళ్లి ప్రయోగం కూడా చేయలేదు. కానీ నేను ఫుడ్ లవర్ ని, తరచూ నా ఫోన్ ద్వారా ఫుడ్ ని ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. నాగ చైతన్య షోయూ రెస్టారంట్ లో మాత్రమే కాదు, ఇతర హోటల్స్ లో కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాను. కచ్చితంగా ప్రతీ రోజు ఎదో ఒకటి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవాల్సిందే. లేకపోతే నాకు రోజు గడవదు. ఒక్కోసారి దగ్గరివాళ్లతో పునుగులు, బజ్జీలు, సమోసాలు వంటివి తెప్పించుకొని తింటుంటాను. మంచి భోజనం ఎక్కడుంటే అక్కడ, అందరినీ అడిగి కనుక్కొని వెళ్లి మరీ తింటుంటాను. అయితే ఎంత తిన్నప్పటికీ కూడా వర్కౌట్స్ చేయడం మాత్రం మిస్ అవ్వను. అందుకే నా ఫిజిక్ ఇలా ఉంది ‘ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక చీకట్లో సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రం లో శోభిత క్రైమ్ పోడ్ క్యాస్టర్ గా నటించింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు చంద్ర పెమ్మరాజు రచన అందించారు. అదే విధంగా ఈ చిత్రం లో సీనియర్ హీరోయిన్ ఆమని, ఈషా చావ్లా, విశ్వదేవ్ రాచకొండ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే శోభిత ధూళిపాళ ప్రస్తుతం, తమిళం లో వెట్టువమ్ అనే చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో ఆర్య, దినేష్ హీరోలుగా నటిస్తున్నారు. కబాలి ఫేమ్ PA రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.