మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని సినీ నటుడు మంచు విష్ణు పిలుపునిచ్చారు. తాజాగా ‘మా అధ్యక్ష ఎన్నికలపై మంచు విష్ణు ఒక వీడియోను విడుదల చేశారు. పెద్దలు ఏకగ్రీవం చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని విష్ణు ప్రకటించారు. ఏకగ్రీవం చేయని పక్షంలో పోటీలో ఉంటానని విష్ణు స్పష్టం చేశారు. ‘మా’ అసోసియేషన్ భవనాన్ని తాను, తన కుటుంబ సభ్యులం కట్టిస్తామని విష్ణు హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మద్రాసు నుంచి హైదరాబాద్ కు మా అసోసియేషన్ వచ్చిన తీరు.. సినీ నటులు , మోహన్ బాబు పడిన కష్టాలను మంచు విష్ణు చెప్పుకొచ్చారు.
మా అసోసియేషన్ కు బిల్డింగ్ నిర్మించాలన్నది ఎన్నో రోజుల ఎజెండా.. మా బిల్డింగ్ నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేను ఇస్తానని.. నా కుటుంబంతో కలిసి ఆ బిల్డింగ్ ను నేను నిర్మిస్తానని మంచు విష్ణు తెలిపారు. సినిమాల్లో పనిచేసే వారంతా ఇక్కడ మెంబర్ షిప్ తీసుకోవాలని కోరారు. లేకపోతే వారికి అవకాశాలు ఇవ్వొద్దన్నారు.
ఇండస్ట్రీ పెద్దలు అంతా కూర్చొని ‘మా’ కుటుంబాన్ని నడిపించడానికి వాళ్లే ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటానని.. పోటీ నుంచి తప్పుకుంటానని మంచి విష్ణు ప్రకటించారు. ఏకగ్రీవం కాని పక్షంలో పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. ‘మా’ ప్రెసిడెంట్ గా నన్ను ఆశీర్వదిస్తారని కోరుతున్నానని మంచు విష్ణు వీడియోలో పేర్కొన్నారు.