Skanda: సినిమాల ద్వారా రాజకీయాలను విమర్శించడం కొత్తేమి కాదు. ఈ మధ్య దాని డోసు ఎక్కువైన సూచనలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వాన్ని ఏకిపారేస్తూ భారీ డైలాగ్స్, సన్నివేశాలు పెడుతున్నారు. ముఖ్యంగా బాలయ్య ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఆయన గత రెండు చిత్రాలు అఖండ, వీరసింహారెడ్డిలో బాలకృష్ణ పలికిన పొలిటికల్ సెటైర్స్ కాకరేపాయి. అసలు సన్నివేశాలతో సంబంధం లేకుండా వీరసింహారెడ్డిలో డైలాగ్స్ ఉంటాయి. దీనిపై దర్శకుడు గోపీచంద్ మలినేనిని ప్రశ్నించగా కథలో భాగంగానే రాసిన డైలాగ్స్ అన్నాడు.
వీరసింహారెడ్డి చిత్రానికి సాయి మాధవ్ బుర్రా మాటలు అందించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్సార్ యూనివర్సిటీగా మార్చడంపైన ఆ చిత్రంలో డైలాగ్స్ ఉన్నాయి. దర్శకుడు బోయపాటి టీడీపీ అనుకూలుడు. బాలయ్యకు సన్నిహితుడు. టీడీపీ అధికారంలో ఉండగా ఆ ప్రభుత్వం ప్రమోషనల్ వీడియోలు బోయపాటి తెరకెక్కించేవాడు. ఆయన దర్శకత్వంలో మూవీ అంటే వైఎస్ జగన్ టార్గెట్ గా డైలాగ్స్ ఉంటాయి.
స్కంద సెకండ్ ట్రైలర్ ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది. ”మనిషికో పేరు, ఊరికో గౌరవం, ప్రతి పదవికి ఓ బాధ్యత ఉంటుంది. అది మరచిపోయి మీరు ఇద్దరూ తీసిన పరువు, కూల్చేసిన ఆత్మగౌరవం తిరిగి మీరే నిలబెట్టాలి” అని రామ్ ట్రైలర్ లో చెప్పాడు. సీఎం పదవిలో ఉన్న జగన్ ఆ పదవికి ఉన్న గౌరవం తగ్గించేలా ప్రవర్తిస్తున్నారని, ఈ డైలాగ్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు.
అలాగే సీఎం అయిపోతా… అని రామ్ చెబుతాడు. సీఎం కావడం పెద్ద మేటర్ కాదని తాగించి, తినిపించి, బెదిరిస్తే చాలు సీఎం పదవి సొంతం అవుతుందని ఓ పొలిటికల్ సెటైర్ వేశాడు. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద కూడా స్కంద మూవీలో డైలాగ్స్, సన్నివేశాలు జొప్పించారనిపిస్తుంది. జైలు సీన్ చూపిస్తూ… ”పరిస్థితులకు తలవంచి తప్పు చేశానని మీరు ఒప్పుకోవచ్చు, ఆ చట్టం ఒప్పుకోవచ్చు, ఆ ధర్మం ఒప్పుకోవచ్చు, కానీ ఆ దైవం ఒప్పుకోదు సర్” అని ఓ డైలాగ్ ఉంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం. పైనున్న ఆ దేవుడు చూస్తున్నాడని చెప్పారనిపిస్తుంది.
ఇక రామ్ పోతినేని కూడా టీడీపీ సానుభూతిపరుడే. రమేష్ హాస్పిటల్స్ లో కోవిడ్ సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. రామ్ పోతినేని బంధువైన రమేష్ పై ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. ఆ సమయంలో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రామ్ పోతినేని ట్వీట్స్ వేశాడు. కాగా స్కంద సెప్టెంబర్ 28న విడుదల కానుంది.