Singer Mangli Birthday Party Issue: సినీ నేపథ్యగాయని మంగ్లీ పై( singer mangli) ఎవరూ కనికరం చూపడం లేదు. ఆమె బర్త్డే పార్టీలో గంజాయి విందు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వివాదంలో కూరుకుపోయారు మంగ్లీ. అయితే ఆమె విషయంలో సానుభూతి అంతగా వ్యక్తం కావడం లేదు. దానికి కారణం ఆమె తీరు అన్న విమర్శలు ఉన్నాయి. అనవసరంగా ఆమె రాజకీయ పార్టీలతో అంటగాకుతూ వ్యవహరించడం ఇప్పుడు మెడకు చుట్టుకుంటోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమె వ్యతిరేకించిన పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇన్నాళ్లు పదవులు పొందిన పార్టీల నుంచి లౌక్యంగా తప్పుకున్నానని ఆమె భావించారు. కానీ అంతకుమించి కష్టాలు ఇప్పుడు ఆమె ఎదుర్కొంటున్నారు. మొన్న ఆ మధ్యన తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని.. తనకు అవకాశాలు తగ్గుముఖం పట్టాయని కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యక్తిగా ముద్ర..
వాస్తవానికి మంగ్లీ రాయలసీమ( Rayalaseema ) బిడ్డ. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె సింగర్ గా ఎదిగారు. ప్రముఖ నేపథ్య గాయకుల సరసన చేరారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. కానీ ఆమె రాయలసీమ బిడ్డనంటూ ఎన్నడు బయట పెట్టలేదు. సినీ అవకాశాల కోసం తెలంగాణ బిడ్డగా గుర్తింపు పొందాలని తాపత్రయపడ్డారు. సినీ నేపథ్య గాయనిగా ఎదిగిన ఆమె అదే రంగంలో కొనసాగి ఉంటే పర్వాలేదు. కానీ అధికార పార్టీలకు అంటగాకారు. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు తీసుకున్నారు. తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు రెండు చోట్ల ఆ పార్టీలకు వ్యతిరేక ప్రభుత్వాలు వచ్చాయి. మంగ్లీ లాంటి గాయని ఇప్పుడు బాధితురాలిగా మారిపోయారు.
Also Read: Singer mangli : ఆ ఒక్క పాటతో కెరీర్ కోల్పోయా.. సింగర్ మంగ్లీ బాధ వెనుక కారణం ఇదీ
వైసీపీ హయాంలో టీటీడీ పదవి..
2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ కోసం మంగ్లీ పాడిన పాట విపరీతంగా వైరల్ అయింది. ఆమె పాటను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాగా వాడుకుంది. జగన్మోహన్ రెడ్డితో మంగ్లీ వ్యక్తిగత సాన్నిహిత్యం కూడా పెరిగింది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆమెకు కీలక పదవి దక్కింది. టిటిడి అనుబంధంగా నడిచే ఎస్వీబీసీ ఛానల్ కు డైరెక్టర్ గా మంగ్లీని నియమించారు. నెలకు లక్షల జీతం, ప్రోటోకాల్.. ఇలా అధికార దర్పాన్ని బాగానే చూపారు మంగ్లీ. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఎక్కడా కనిపించలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా పాటలు పాడలేదు.
సోషల్ మీడియాలో ట్రోల్..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఏపీలో టిడిపి తో పాటు తెలంగాణలో కాంగ్రెస్తో చెలిమికి ప్రయత్నం చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. ఏపీలో అయితే ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి శ్రీకాకుళం వెళ్ళిన ఆమె కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో( Ram Mohan Naidu ) కలిసి సూర్య దేవస్థానంలో ప్రత్యక్షమయ్యారు. అయితే తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించిన మంగ్లీ లాంటి వ్యక్తిని రామ్మోహన్ నాయుడు ఆదరించడం ఏంటని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇప్పుడు తెలంగాణలో బర్త్డే పార్టీలో గంజాయి వినియోగించారు అన్న కలకలం రేగింది. అయితే అనవసరంగా రాజకీయాల జోలికి వెళ్లిన మంగ్లీ పట్ల ఇప్పుడు ఎవరూ పెద్దగా కనికరం చూపడం లేదు. అది ఆమె స్వయంకృతాపరాధం అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.