Game changer Dhop Song: ఈ ఏడాది సంచలనాత్మకంగా మారిన అంశాలలో ఒకరి జానీ మాస్టర్ కేసు వ్యవహారం. ఆయన టీం లో అసిస్టెంట్ గా పని చేస్తున్న శ్రేష్టి వర్మ, తన పై జానీ మాస్టర్ లైంగిక దాడులు చేసాడని, తనని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని నార్సింగి పోలీస్ స్టేషన్ లో సంచలన ఆరోపణలు చేస్తూ జానీ మాస్టర్ పై కేసు వెయ్యడం. పోలీసులు జానీ మాస్టర్ ని అరెస్ట్ చేసి, కోర్టు లో హాజరు పరిచి, ఆ తర్వాత చంచల్ గూడా పోలీస్ స్టేషన్ లో నెల రోజుల పాటు రిమాండ్ లో ఉంచడం. ఆ తర్వాత ఆయన మధ్యంతర బెయిల్ మీద బయటకి రావడం వంటి సంఘటనలు పెను దుమారమే రేపాయి. జానీ మాస్టర్ నిజంగా తప్పు చేశాడా లేదా అనేది కాసేపు పక్కన పెడితే, ఇన్నేళ్లు ఆయన కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలతో పాటు, గెలుచుకున్న నేషనల్ అవార్డు ని కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది.
జైలు నుండి బయటకి వచ్చిన తర్వాత ఇక జానీ మాస్టర్ కి కెరీర్ ఉండదేమో అనుకున్నారు కానీ, ఆయనకీ అవకాశాలు భారీగానే వస్తున్నాయి. నేడు ఆయన కొరియోగ్రఫీ లో చిత్రీకరించబడ్డ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాలోని ‘డోప్’ వీడియో సాంగ్ విడుదలైంది. ఇందులో రామ్ చరణ్ చేత జానీ మాస్టర్ వేయించిన డ్యాన్స్ స్టెప్పులకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే సాంగ్ మధ్యలో కొన్ని డ్యాన్స్ ప్రాక్టీస్ షాట్స్ ని పెట్టారు. ఈ షాట్స్ లో జానీ మాస్టర్ తో పాటు, అతనిపై కేసు వేసిన శ్రేష్టి వర్మ కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సాంగ్ ని గత ఏడాది చివర్లో చిత్రీకరించారట. అంటే ఈ ఏడాది ప్రారంభం వరకు కూడా శ్రేష్టి వర్మ జానీ మాస్టర్ టీం లోనే ఉంది, ఆ తర్వాత ఆ టీం నుండి బయటకి వచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
చాలామంది ‘గేమ్ చేంజర్’ చిత్రం కొత్త సినిమా కదా, జానీ మాస్టర్ తో పాటు ఈ అమ్మాయి కూడా ఉందంటే, వీళ్లిద్దరు మళ్ళీ కలిసిపోయారా అని సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రం నాలుగేళ్ల నుండి సెట్స్ మీద ఉంది. ఈ పాటని గత ఏడాదిలో చితీకరించారు అనే విషయాన్నీ గమనించాలి. ఇకపోతే నేడు విడుదలైన పాటకు సంబంధించి జానీ మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్పులని చూసి, రామ్ చరణ్ అభిమానులు ‘ఊరికినే నేషనల్ అవార్డు ఇవ్వరు..ఇంత టాలెంట్ ఉంది కాబట్టే ఇచ్చారు’ అంటూ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. ఈ పాట తర్వాత జానీ మాస్టర్ కి మళ్ళీ స్టార్ హీరోలు అవకాశాల వెల్లువ కురిపిస్తారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆ రేంజ్ లో పేలింది ఈ సాంగ్.