ప్రముఖ తమిళ నటుడు శింబుపై కుట్రలకు పాల్పడుతున్నారని.. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన తల్లిదండ్రులు, దర్శకుడు టి.రాజేందర్, ఉషా రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఎగ్మూర్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిర్మాత మైఖేల్ రాయప్పన్ నిర్మించిన అన్భాదవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో తన కొడుకు శింబు కథానాయకుడిగా నటించారన్నారు. అయితే అతనికి నిర్మాత పూర్తిగా పారితోషికం చెల్లించలేదని పేర్కొన్నారు.
శింబునే ఆయనకు నష్టపరిహారం చెల్లించాలంటూ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేయడం ఆశ్చర్యకరమని అన్నారు. శింబుపై రెడ్‌కార్డు వేయాలనే కుట్ర జరుగుతోందని టి.రాజేందర్ ఆరోపించారు. ఉషా రాజేందర్ మాట్లాడుతూ ఈ కుట్రను సీఎం స్టాలిన్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అన్నారు. త్వరలోనే ఆయన ఇంటి ముందు నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు.
శింభు హీరోగానే కాక పలు సినిమాలకు డైరెక్టర్‌గా చేశారు. రైటర్, కంపోజర్, డాన్సర్, ప్లేబాక్ సింగర్‌గా కూడా ప్రేక్షకులకు సుపరిచితుడు. ఎన్నో సినిమాలకు అవార్డులు సొంతం చేసుకున్నారు. బెస్ట్ యాక్టర్‌గా ఫిల్మ్ ఫేర్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు.