Shilpa Setty: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పేరు చెబితే చాలు యూత్ కు పులకించిపోయేవారు. అప్పటి కుర్రకారుకు ఆమె ఓ ఆరాధ్య దేవత. ఇక సాగరకన్య తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. పేరుకు తగ్గట్టు ఓ శిల్పి ఉలిని పట్టుకుని అందమైన శిల్పం చెక్కినట్టుగా ఉంటుంది ఆ అందాల సోయగం. ప్రస్తుతం మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయింది. ప్రస్తుతం ఆమె వయసు 50ఏళ్లు దాటుతున్నా ఇంకా పదహారేళ్ల ముద్దుగుమ్మలాగే ఉంటూ యంగ్ హీరోయిన్లను కుళ్లుకునేలా చేస్తుంది. తాజాగా ఈ బాలీవుడ్ భామ ఫోటో వైరల్ కావడంతో వివాదం నెలకొంది. ఒడిశాలోని భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయ నిర్వాహకులు శిల్పా ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో ఒక సేవదార్, అధికారికి షోకాజ్ నోటీసు జారీ అయింది. వాస్తవానికి, ఆలయం లోపల ఫోటోలు తీయడానికి ఆంక్షలు ఉన్నాయి. కానీ శిల్పాశెట్టి ఆలయానికి వెళ్ళినప్పుడు, ఆమె ఫోటోలను ఎవరో తీశారు.
ఈ ఫొటోలు బయటకు రావడంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆ తర్వాత ఆలయ పాలకవర్గం ఈ చర్య తీసుకుంది. ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రాఫ్‌లు, వీడియోలను అనుమతించనప్పుడు శిల్పాశెట్టి ఫోటోగ్రాఫ్‌లు తీయడానికి.. వీడియోలు చేయడానికి ఎలా అనుమతించారని పరిపాలన ప్రశ్నించింది. గత సోమవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు శిల్పాశెట్టి వచ్చినట్లు సమాచారం. ఈ సమయంలో ఆమె సాయంత్రం లింగరాజు ఆలయాన్ని సందర్శించడానికి వెళ్ళింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కలకలం రేగాయి..
భువనేశ్వర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ADM), ఆలయ పరిపాలన ఇన్‌ఛార్జ్ రుద్ర నారాయణ్ మొహంతి మాట్లాడుతూ.. ‘శిల్పా శెట్టి ఫోటోలు వైరల్ అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఓ సర్వీస్‌మెన్, సూపర్‌వైజర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసి, ఏడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరాం. శిల్పాశెట్టితో ఉన్న ఫోటోగ్రాఫ్‌లలో సర్వీస్‌మెన్, సూపర్‌వైజర్ ఇద్దరూ కనిపించారని మొహంతి చెప్పారు.
ఆలయంలో ఫొటోలు తీయడంపై నిషేధం
ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే బాబు సింగ్ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయంలో ఫోటోలు తీయడం పూర్తిగా నిషేధించబడింది. అందుకే నిషేధం ఉన్నప్పటికీ, ఆలయ ప్రాంగణంలోకి కెమెరాలు లేదా మొబైల్ ఫోన్‌లను ఎలా అనుమతించారనే ప్రశ్న తలెత్తుతుంది. ఆలయానికి ప్రధాని, రాష్ట్రపతి వచ్చినా కెమెరాలను లోపలికి అనుమతించడం లేదన్నారు. ఆలయాన్ని సందర్శించే సెలబ్రిటీలు కూడా ప్రాంగణం లోపల మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లవద్దని ఆదేశించినప్పటికీ, ఇప్పటికీ ఈ తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఇటీవల ఆమె రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’లో తార శెట్టి అనే పోలీస్ ఆఫీసర్‌లో పాత్రలో మెప్పించింది.