Senior Heroines: స్టార్ హీరోల కెరీర్ కి ఉండే స్టామినా వేరు. అమితాబ్ లాంటి వారు 50 ఏళ్లకు పైగానే తమ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కానీ, ఎంత గొప్ప స్టార్ హీరోయిన్ అయినా సరే.. సుదీర్ఘ స్క్రీన్ ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఆమెకు ఉండదు. ఒంటిలో తళుకులు తళుక్కుమనే వరకే, వారికీ ఇండస్ట్రీలో గుర్తింపు, ఆదరణ. మహా అయితే హీరోయిన్ కెరీర్ దశాబ్దం పాటు ఉంటుంది. ఎప్పుడైతే కెరీర్ లో వేగం నెమ్మదిస్తోందో, వాళ్ళు వెంటనే పెళ్లి చేసుకుని తెరకు దూరమవుతూ ఉంటారు. అయితే, ఈ మధ్య ట్రెండ్ మారింది. పూర్ణ, ప్రియమణి, శ్రియా లాంటి ఫేడ్ అవుట్ భామలు కూడా గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు.
పైగా నిన్నటి తరం హీరోయిన్స్ కూడా రీ ఎంట్రీ అంటూ స్క్రీన్ పైకి మళ్లీ వస్తున్నారు. ఒకప్పుడు పరిస్థితులు బాగాలేనప్పుడు మాత్రమే స్క్రీన్ పై మళ్లీ మోజు పెంచుకునేవారు సీనియర్ హీరోయిన్లు. ముఖ్యంగా డబ్బుల కోసమే క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమ కొత్త జర్నీ స్టార్ట్ చేసేవారు. కానీ, ఇప్పుడు క్యారెక్టర్లను పుట్టించి మరి, సీనియర్ హీరోయిన్లను మళ్లీ పట్టుకొస్తున్నారు. ఒకప్పటి అందగత్తెలు రమ్యకృష్ణ, టబు, సుహాసిని, ఆమని, ఇంద్రజ, సంగీత, నదియా లాంటి సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు క్యారెక్టర్ల కోసం పోటీ పడుతున్నారు.
దాంతో ప్రస్తుతం సీనియర్ హీరోయిన్లకు బాగా డిమాండ్ తగ్గిపోయింది. రోజురోజుకు తల్లి – ఆంటీ పాత్రల్లో నటించే వారి సంఖ్య బాగా ఎక్కువ అయిపోయింది. ప్రభాస్ రాధేశ్యామ్ తో అలనాటి అందగత్తె భాగ్యశ్రీ కూడా అమ్మగా రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం భాగ్యశ్రీ కూడా ఛాన్స్ ల కోసం సిఫార్సులు చేయించుకుంటుంది.
మరోపక్క ‘సరిలేని నీకెవ్వరు’ చిత్రంతో విజయశాంతి కూడా రీఎంట్రీ ఇచ్చింది. విజయశాంతి కూడా తల్లి పాత్రలను అంగీకరిస్తాను అంటుంది. అల వైకుంఠపురములో టబు తల్లిగా తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ రోజుల్లో కూలీ నెం 1 చిత్రంతో గ్లామర్ స్టార్‌గా ఎదిగింది. బాలీవుడ్‌కు వెళ్లి అక్కడా కీర్తి పతాకం ఎగురవేసింది. ఒకే ఒక్క అవకాశం ప్లీజ్ అన్న డైలాగ్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగీత కూడా మళ్లీ సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకు ముందుకు వచ్చింది. మంగమ్మగారి మనవడు చిత్రం నుంచి మంచి నటిగా పేరు తెచ్చుకున్న సుహాసిని కూడా ప్రస్తుతం ఆంటీ పాత్రల్లో అలరిస్తోంది.
అసలు ఇంద్రజ అంటేనే యమలీల గురొస్తుంది. ‘నీ జీను పాంటు చూసి పిల్లోడా’ అన్నపాట వింటేనే ఇంద్రజ రూపురేఖలు గుర్తుకు వస్తాయి. ఇక ఇంద్రజ కూడా ప్రస్తుతం రీ ఎంట్రీలో అందమైన అమ్మ పాత్రల కోసం ఇమిడిపోతాను అంటుంది. ‘నా మొగుడు నాకే సొంతం’ అంటూ తెలుగు తెరకు పరిచయం అయిన వాణీ విశ్వనాధ్ కూడా రీ ఎంట్రీ ఇచ్చింది.
అలాగే, భూమిక చావ్లా కూడా ప్రస్తుతం ప్రాధాన్యత కలిగిన పాత్రల్లో కనిపిస్తోంది. ఇక ఖుష్బూ స్టాలిన్ తో పాటు మీనా, రాశి, పెద్దరికం నాయిక సుకన్య, సిమ్రాన్, రోజా ఫేం మధుభాల ఇలా చాలామందే ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం లైలా, నగ్మా, రంభ, నిరోషా లాంటివారు కూడా రీఎంట్రీకి తహతహలాడుతూ ఉన్నారు. వీరి మధ్య చిన్నపాటి పోటీ కూడా ఎక్కువగానే ఉంది.
మొత్తమ్మీద చెప్పొచ్చేదేమిటంటే, గతంలో అద్భుతమైన స్టార్ డమ్ తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్లు ఇపుడు అందమైన అమ్మలుగా తెరపై ప్రత్యక్షమవుతున్నారు. తమ అందాలతో తెలుగు ప్రేక్షకులకు ఆనందాన్ని ఇస్తున్నారు. కానీ, సెకెండ్ ఇన్నింగ్స్ లో మాత్రం కొందరికి ఛాన్స్ లు రావడం లేదు. ఈ భారీ పోటీలో గ్లామర్‌తో మిసమిసలాడే మాజీ హీరోయిన్ల హవాకి గట్టి వార్ జరుగుతుంది. వీరిలో కొందరికి అవకాశాలు రావడం లేదు. కానీ అదృష్టం బాగుండి మంచి పాత్రలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రమ్యకృష్ణ, నదియా లాంటి వారు మాత్రం తమ కేటగిరిలో తెలుగు తెరను మరోసారి ఏలుతున్నారు.