Rajendra Prasad Daughter: ప్రముఖ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె గాయత్రి నిన్న అర్థ రాత్రి 12 గంటల 40 నిమిషాలకు గుండెపోటు తో మరణించింది. ఆమె వయస్సు కేవలం 38 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయస్సులోనే గుండెపోటు వచ్చి మరణించడం బాధాకరం. నిన్న రాత్రి ఆమెకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావడంతో ఆమెని కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాద్ లోని AIG హాస్పిటల్స్ లో చేర్పించారు. చికిత్స అందించే ముందే ఆమెకి మార్గ మద్యంలో తీవ్రమైన గుండెపోటు వచ్చింది. హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత ఆమెని పరీక్షించిన డాక్టర్లు చనిపోయినట్టుగా నిర్ధారించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం మొత్తం ఒక్కసారిగా శోకసంద్రం లో మునిగిపోయింది. పలు ఇంటర్వ్యూస్ లో రాజేంద్ర ప్రసాద్ తన కూతురు గురించి చెప్పడం మనమంతా చూసే ఉంటాము.
తన కూతురు తనకి ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా కోపం వచ్చిందని, చాలా సంవత్సరాలు ఆమెతో మాట్లాడలేదని, కానీ మనవరాలు పుట్టిన తర్వాత నాకు ఆమె మీద ఉన్న కోపం మొత్తం పోయిందని, అల్లుడితో మాట్లాడిన తర్వాత అతను చాలా మంచోడు, తాను కష్టపడి ప్రయత్నం చేసినా అలాంటి కుర్రాడిని మా కూతురుకి తీసుకొని రాలేనని అర్థం అయ్యింది అంటూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడిన మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. గాయత్రి కి సాయి తేజస్విని అనే కూతురు ఉంది. ఈమె రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్ర పోషించిన ‘మహానటి’ చిత్రం లో, చిన్నప్పటి కీర్తి సురేష్ క్యారక్టర్ ని చేసింది. చాలా చలాకీగా, క్యూట్ గా నటించిన ఈ అమ్మాయిని చూసి ‘ఎవరీ చిన్నారి..చాలా హుషారుగా ఉందే’ అని అందరూ మాట్లాడుకున్నారు. ఆమె రాజేంద్ర ప్రసాద్ మనవరాలు అని సినిమా విడుదలైన తర్వాత తెలిసింది. ఆ చిన్నారి పాపం ఇంత చిన్న వయస్సులోనే తన తల్లిని పోగొట్టుకోవడం బాధాకరం.
గాయత్రి కొన్నేళ్ల నుండి తన కుటుంబం తో కలిసి హైదరాబాద్ లోనే ఉంటుంది. తన తండ్రి అప్పట్లో ఆమెని దూరం పెట్టినా, గాయత్రి మాత్రం తన తండ్రికి దూరం గా ఉండలేకపోయింది. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడకపోయినా కూడా ఆయన ఇంటికి వెళ్తూ ఉండేదట, తన మీద కోపం తగ్గించేందుకు చాలా ప్రయత్నాలు కూడా చేసిందట. అలాంటి మంచి అమ్మాయి ఇంత చిన్న వయస్సులో స్వర్గస్తులు అవ్వడం అత్యత్న విచారకరం. రాజేంద్ర ప్రసాద్ కి గాయత్రి తో పాటు కొడుకు కూడా ఉన్న సంగతి తెలిసిందే. కొడుకు పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించాడు. ఈ పెళ్ళికి గాయత్రి కూడా హాజరు అయ్యింది. పెద్ద వయస్సులో ఉన్నప్పుడు తన చేతులతో పెంచి పెద్ద చేసిన కూతురు చనిపోతే ఆ తండ్రికి ఎంత బాధ కలుగుతుందో మాటల్లో వర్ణించలేము. మన అందరికీ హాస్యాన్ని పంచే రాజేంద్ర ప్రసాద్, ప్రస్తుతం అలాంటి బాధనే మోస్తున్నాడు. ఆయన ఈ బాధని తట్టుకునే శక్తి ఆ దేవుడు ప్రసాదించాలని, గాయత్రి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుందాం.