Satyam Sundaram Trailer: సత్యం సుందరం ట్రైలర్ రివ్యూ: నవ్విస్తూనే ఏడిపించేసిన కార్తీ, గుండెలు పిండేసిన ప్రోమో!

హీరో కార్తీ ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన నుండి వస్తున్న మరో విభిన్నమైన చిత్రం సత్యం సుందరం. విలేజ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. సత్యం సుందరం విడుదల నేపథ్యంలో ట్రైలర్ విడుదల చేశారు. మరి సత్యం సుందరం ట్రైలర్ ఎలా ఉంది?

Written By: S Reddy, Updated On : September 24, 2024 10:32 am

Satyam Sundaram Trailer

Follow us on

Satyam Sundaram Trailer: తెలుగులో కూడా మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరోల్లో కార్తీ ఒకడు. ఆయన లేటెస్ట్ మూవీ సత్యం సుందరం. సెప్టెంబర్ 28న విడుదల కానుంది. తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేస్తున్నారు. సత్యం సుందరం ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. దర్శకుడు కామెడీ, ఎమోషన్స్ ప్రధానంగా సత్యం సుందరం మూవీ తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.

అమాయకుడైన పల్లెటూరి వ్యక్తిగా కార్తీ పాత్ర ఉంది. కార్తీ క్యారెక్టర్ లోని ఇన్నోసెన్స్, బాడీ లాంగ్వేజ్ నవ్వులు పూయిస్తుంది. ఆయన డైలాగ్ డెలివరీ సైతం కట్టిపడేసేదిగా ఉంది. ఈ చిత్రంలోని మరో ప్రధాన పాత్ర అరవింద స్వామి చేశాడు. ఆయన రోల్ ఒకింత సీరియస్ అండ్ ఇంటెన్స్ టోన్ లో ఉంది. చాలా కాలం తర్వాత పట్నం నుండి సొంతూరు వచ్చిన అరవింద స్వామికి ఎదురైన పరిస్థితులు ఏమిటనేది ఆసక్తికర అంశం.

కార్తీ-అరవింద స్వామి బావబామ్మర్ధిగా కనిపించనున్నారు. కార్తీ తన అమాయకత్వంతో అరవింద స్వామిని నవ్విస్తూ, ఏడిపిస్తూ, విసిగిస్తూ ఉంటాడు. వీరిద్దరి మధ్య సాగే ఎమోషనల్ డ్రామానే సత్యం సుందరం మూవీ. ట్రైలర్ ఆకట్టుకోగా అంచనాలు పెరిగాయి. మూవీలో ఎమోషనల్ యాంగిల్ ఏమిటనేది పూర్తిగా రివీల్ చేయలేదు. కథలో ట్విస్ట్ కూడా అదే కావచ్చు.

సత్యం సుందరం చిత్రానికి సీ. ప్రేమ్ కుమార్ దర్శకుడు. గతంలో ఈ దర్శకుడు తెరకెక్కించిన 96 భారీ విజయం అందుకుంది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు. ఈ చిత్రానికి గోవింద్ వసంత్ అందించిన మ్యూజిక్ ఆకర్షణగా నిలిచింది. సత్యం సుందరం చిత్రానికి సైతం గోవింద్ వసంత్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు.

సత్యం సుందరం చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్య, జ్యోతిక నిర్మించడం విశేషం. కమర్షియల్ అంశాలు లేని ఓ ఎమోషనల్ డ్రామాను నమ్మి నిర్మించారు. జ్యోతిక దంపతులకు సత్యం సుందరం మూవీ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. కాగా సెప్టెంబర్ 27న ఎన్టీఆర్ నటించిన దేవర విడుదలవుతున్న సంగతి తెలిసిందే..