Hydra: హైదరాబాదులో రియల్ ఎస్టేట్ రంగంపై హైడ్రా ప్రభావం చూపించిందని తెలుస్తోంది. దేశంలోనే 9 ప్రధాన నగరాలలో జూలై నుంచి సెప్టెంబర్ నెల మధ్య గృహాల విక్రయాలపై ప్రాప్ డిప్యూటీ అనే సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. నివేదిక ప్రకారం హైదరాబాదు నగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో గృహాల విక్రయాలు 42% క్షీణించాయి. ఆ తర్వాత బెంగళూరు 26%, కోల్ కతా 23%, పుణె 19 %/, చెన్నై 18 %, ముంబై 17%, థానె 10% తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్సీఆర్ 22%, నవీ ముంబై 4 శాతం విక్రయాలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. పై 9 నగరాలలో జూలై – సెప్టెంబర్ నెలలో గృహాల విక్రయాలు 1,04,393 యూనిట్లుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఏడాది ఇదే సమయంలో 1,26,848 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఈ ప్రకారం 18 శాతం పతనం అయినట్టు తెలుస్తోంది.
హైదరాబాదులో 12 వేల యూనిట్లకు
హైదరాబాద్ నగరంలో జూలై – సెప్టెంబర్ నెలలకు సంబంధించి గృహాల విక్రయాలు 12,082 యూనిట్లుగా ఉండొచ్చని తెలుస్తోంది. గత ఏడాది ఇదే సమయానికి 20,658 యూనిట్ల విక్రయాలు జరిగాయి. దేశంలోని అన్ని నగరాల కంటే హైదరాబాదులోనే గృహాల విక్రయాలలో క్షీణత నమోదయిందని తెలుస్తోంది. అంతకు ముందు ఏడాది హైదరాబాద్ నగరంలో దేశంలోనే ఎక్కువగా ఇళ్ల విక్రయాలు ఇక్కడనే నమోదు కావడం విశేషం. మహానగరాలను కాదని హైదరాబాదులోనే రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోయిందని.. ఇప్పుడు పరిస్థితి అందుకు విరుద్ధంగా మారిందని భారత రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు.
హైడ్రా దూకుడు వల్ల..
హైడ్రా దూకుడు వల్ల హైదరాబాదులో గృహాల అమ్మకాలలో తగ్గుదల ఏర్పడిందని అంటున్నారు. ” కొందరు అక్రమార్కులు చట్ట విరుద్ధమైన పనులు చేశారు. వారి వల్ల నిర్మాణరంగం పూర్తిగా కుదేలైంది. అక్రమల లే అవుట్ల వల్ల అమాయకులు బలైపోయారని” రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర రంగాల అంటున్నారు..
వాటి జోలికి వెళ్లడం లేదు
హైడ్రా దూకుడు వల్ల చెరువుల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరూ ఇళ్లను కొనుగోలు చేయడం లేదు.. చాలా దూరం వరకు అపార్ట్మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేయడం లేదు. ఇండిపెండెంట్ ఇళ్లు, ఓపెన్ ప్లాట్లను కొనడానికి ఎవరూ ఆసక్తి చూపించడం లేదు. పరిస్థితి దారుణంగా ఉందని.. కరోనా కాలంనాటి ఆందోళనలు కనిపిస్తున్నాయని రియల్ ఎస్టేడి వ్యాపారాలు అంటున్నారు. సాధారణంగా దసరా, దీపావళి సమయంలో ఇళ్ల విక్రయాలు జోరుగా ఉంటాయి.. కానీ అలాంటి సంకేతాలు ఇప్పుడు కనిపించడం లేదు.. పేరుపొందిన సంస్థల ఇళ్ల విక్రయాలు కూడా అంతంత మాత్రం గానే ఉన్నాయి. హైడ్రా దూకుడు వల్ల చాలామంది ఒకటికి 20 సార్లు ఆలోచించుకుని ఇళ్లను కొనుగోలు చేస్తున్నారని.. అందులోనూ ప్రీమియం గృహాల జోలికి వెళ్లడం లేదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు. భూముల ధర కూడా దారుణంగా పతనమైందని.. శివారు ప్రాంతంలో ఒక్కో ప్లాట్ పై నికరంగా 10 లక్షల వరకు విలువ తగ్గిందని వ్యాపారులు అంటున్నారు. ప్రభుత్వం తమకు శుభవార్త చెబితేనే రియల్ ఎస్టేట్ రంగంలో కాస్త కదలిక వస్తుందని వివరిస్తున్నారు. “రేవంత్ ప్రభుత్వం హైడ్రా పేరుతో వ్యవస్థను తీసుకురావడం మంచిదే. కాకపోతే దీనివల్ల పకడ్బందీగా వ్యాపారం చేసేవారు ఇబ్బంది పడుతున్నారని” రియల్ ఎస్టేట్ వ్యాపారులు అంటున్నారు.