Sankrantiki Vastunnaam : విక్టరీ వెంకటేష్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ థియేటర్స్ లో ఈ చిత్రం విజయవంతంగా నడుస్తూనే ఉంది. మూడవ వారం లో 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నాల్గవ వారం లో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. కొత్త సినిమాలు ఎన్ని విడుదలైన, పోటీ కి ఎన్ని సినిమాలొచ్చినా ఆడియన్స్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని చూస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో ఇంత అద్భుతమైన రన్ అవుతుంది కాబట్టి ఓటీటీ లోకి ఇప్పట్లో రాదని అందరూ అనుకున్నారు. కనీసం మరో రెండు నెలల సమయం పడుతుందని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు తప్పు అయ్యాయి. ఓటీటీ లో కంటే ముందుగా టీవీ లో ఈ చిత్రం ప్రత్యక్షం కానుంది.
ఇదే ఇప్పుడు ప్రేక్షకులను షాక్ కి గురి చేస్తున్న విషయం. టీవీ లో త్వరలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ప్రసారం కాబోతుంది అంటూ ఒక ప్రకటన చేసారు. ఈ సినిమా డిజిటల్ + సాటిలైట్ రైట్స్ ని జీ స్టూడియోస్ సంస్థ కొనుగోలు చేసింది. ఈమధ్య కాలంలో జీ స్టూడియోస్ కొన్న తెలుగు సినిమాలకు ఆశించిన స్థాయిలో టీఆర్ఫీ రేటింగ్స్ రావడం లేదు. భారీ ఆశలు పెట్టుకున్న ‘కల్కి’, ‘సరిపోదా శనివారం’ చిత్రాలు కూడా నిరాశపర్చాయి. అందుకే ఈసారి గట్టి టీఆర్ఫీ రేటింగ్స్ ని అందుకోవాలని ఈ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో అత్యంత ఆదరణ దక్కించుకున్న ఈ సినిమా శివరాత్రికి జీ తెలుగు లో ప్రసారమయ్యే అవకాశాలు ఉన్నాయి. గడిచిన ఐదేళ్ళలో జీ తెలుగు ఛానల్ కి అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని రాబట్టిన సినిమా ‘వకీల్ సాబ్’.
ఈ చిత్రానికి మొదటి టెలికాస్ట్ లో 19 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి. రిపీట్ టెలికాస్ట్ లో కూడా ఆరు నుండి 8 టీఆర్ఫీ రేటింగ్స్ కి తగ్గలేదు. ఇప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కచ్చితంగా ఆ రికార్డుని బద్దలు కొడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు. 20 నుండి 25 కి మధ్యలో టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్న జీ తెలుగు ఛానల్ ని ఈ సినిమా ఎంతమేరకు కాపాడుతుంది అనేది చూడాలి. ఇకపోతే థియేటర్స్ లో ఇప్పటి వరకు ఈ చిత్రానికి 280 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో మరో పది కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక ప్రాంతీయ బాషా చిత్రానికి ఈ రేంజ్ వసూళ్లు రావడం ఇదే తొలిసారి. షేర్ వసూళ్లు దాదాపుగా 160 కోట్లు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు.