Samantha: టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్ లలో సమంత ఒకరు.. తెలుగులో జెస్సీగా పరిచయం అయిన సామ్ యువత హృదయాలను మాయచేశారనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ‘ఏ మాయ చేశావే’ సినిమాతో తెలుగులో అడుగు పెట్టిన ఈ భామ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్ గానే కాకుండా లేడి ఓరియెంటెడ్ మూవీస్ లో నటించి భారీ విజయాలను అందుకున్నారు.
విభిన్నమైన పాత్రలను పోషించడంతో పాటు వ్యాఖ్యాతగా, వ్యాపారవేత్తగా రాణించిన సమంత మరో అడుగు ముందుకు వేశారు. త్వరలోనే నిర్మాతగా చిత్రాలను తెరకెక్కించనున్నారు. అవును మీరు వింటున్నది నిజమే. సమంత నిర్మాతగా అరంగేట్రం చేయనున్నారు. ఈ మేరకు కొత్త ప్రొడక్షన్ కంపెనీని సైతం ప్రారంభిస్తున్నారు. అంతే కాదు సదరు సంస్థకు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ’ అనే పేరును కూడా ఖరారు చేశారు.
నిర్మాత సంస్థకు సంబంధించిన లోగోను సామ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. హాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఇంగ్లీష్ పాప్ సాంగ్ ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్’ లో వచ్చే లిరిక్స్ నుంచి ‘ట్రాలాలా’ అనే పదాన్ని తీసుకున్నట్లు ఆమె వెల్లడించారు. అంతేకాదు సినీ పరిశ్రమలోకి కొత్తగా వచ్చే వారికి తన నిర్మాణ సంస్థ వేదికగా మారుతుందని చెప్పారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంతో పాటు మంచి కథలను ఎంపిక చేసి నిర్మిస్తామని తెలిపారు.
సినిమా నిర్మాణాల నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన ఎంటర్ టైన్ మెంట్ కంపెనీ ‘మండోవా మీడియా వర్స్క్ ’ తో సమంత ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. అయితే సినీ రంగంలో ఈ సంస్థకు కూడా మంచి పేరున్న సంగతి తెలిసిందే. చిత్రాలే కాకుండా వెబ్ సిరీస్ లు, టీవీ ప్రొగ్రామ్స్ కూడా రూపోందించే అవకాశం ఉందని సమాచారం.