Salaar Advance Bookings: వరుస ప్లాప్స్ పడినా ప్రభాస్ మేనియా ఇంచు కూడా తగ్గలేదు. ఆయన నెక్స్ట్ మూవీ సలార్ పై భారీ హైప్ ఉంది. సలార్ యూఎస్ లో రికార్డు వసూళ్ల దిశగా దూసుకువెళుతుంది. విడుదలకు నెల రోజులకు ముందే ఈ సినిమా ఆర్ ఆర్ ఆర్ రికార్డుపై కన్నేసింది. ప్రభాస్ గత మూడు చిత్రాలు సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ నిరాశపరిచాయి. సాహో కొంత పర్లేదు. కనీసం హిందీలో వసూళ్లు రాబట్టింది. రాధే శ్యామ్, ఆదిపురుష్ భారీ నష్టాలు మిగిల్చాయి. ముఖ్యంగా ఆదిపురుష్ విమర్శలపాలైంది. హిందూ వర్గాలు ఈ చిత్రం మీద దుమ్మెత్తిపోశాయి.
మోడరన్ రామాయణ పేరుతో ఇష్టం వచ్చినట్లు తెరకెక్కించారని, హిందువుల మనోభావాలు దెబ్బతీశారన్న ఆరోపణలు వినిపించాయి. ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్క సాలిడ్ హిట్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభాస్ ని హిట్ ట్రాక్ ఎక్కించే మూవీ సలార్ అవుతుందని భావిస్తున్నారు. సలార్ ప్రభాస్ ఇమేజ్ కి సెట్ అయ్యే పక్కా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. ఇక దర్శకుడు ప్రశాంత్ నీల్ కావడంతో అంచనాలు ఆకాశానికి చేరాయి.
ఈ మూవీకి ఇండియాలోనే కాదు యూఎస్ లో కూడా భారీ హైప్ ఉందని అడ్వాన్స్ సేల్స్ తో నిరూపితమైంది. యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. విడుదలకు నెల రోజులు ఉండగా $4 లక్షల డాలర్స్ మార్క్ దాటేసింది. సౌత్ టాప్ అడ్వాన్స్ సేల్స్ గ్రాసర్స్ లో సలార్ ఒకటిగా రికార్డులకు ఎక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్ ఆర్ ఆర్ ఈ లిస్ట్ లో టాప్ లో ఉంది. ఏకంగా $3.46 మిలియన్ డాలర్స్ అడ్వాన్స్ సేల్స్ అందుకుంది.
అనంతరం బాహుబలి కన్క్లూషన్ $2.45 మిలియన్స్ తో రెండో స్థానంలో ఉంది. కబాలి $ 1.92 మిలియన్స్, అజ్ఞాతవాసి $1.52, బాహుబలి బిగినింగ్ $ 1.36 మిలియన్స్ తో టాప్ ఫైవ్ లో ఉన్నాయి. సలార్ జోరు చూస్తే బాహుబలి 2 లేదా ఆర్ ఆర్ ఆర్ రికార్డు లేపేయడం ఖాయంగా కనిపిస్తుంది. సలార్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్. పృథ్విరాజ్ సుకుమారన్ విలన్ రోల్ చేస్తున్నారు. జగపతిబాబు కీలక రోల్ చేస్తున్నారు.