Salaar: సలార్ విడుదలకు పది రోజుల సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ ఐదు భాషల్లో విడుదల కానుంది. ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల ట్రైలర్ విడుదల చేశారు. మిశ్రమ స్పందన దక్కింది. కెజిఎఫ్ షేడ్స్ సలార్ లో కూడా స్పష్టంగా కనిపించాయి. ట్రైలర్ లో మూవీ కథపై హింట్ ఇచ్చేశారు. ఖాన్సార్ అనే ఒక కల్పిత రాజ్యాన్ని ప్రశాంత్ నీల్ సృష్టించాడు.
దీన్ని అధీనం చేసుకోవాలని కొన్ని గ్యాంగ్స్ ప్రయత్నం చేస్తాయి. మిత్రుడు పృథ్విరాజ్ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు స్నేహితుడి కోసం ప్రభాస్ రంగంలోకి దిగుతాడు. అతడే ఒక సైన్యంగా ప్రాణ మిత్రుడికి సహాయం చేస్తాడు. సలార్ పార్ట్ 2 కూడా ఉందని ట్రైలర్ ద్వారా చెప్పారు. విడుదలకు సమయం దగ్గరపడుతున్నా ప్రభాస్ మాత్రం బయటకు రావడం లేదు. సలార్ ప్రొమోషన్స్ లో ప్రభాస్ పాల్గొనే అవకాశం లేదంటున్నారు.
దీంతో నిర్మాతలే చిత్రాన్ని ప్రోమోట్ చేసుకుంటున్నారు. సలార్ నిర్మాత విజయ్ కిరగందూర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. సలార్ విడుదలకు ఒక రోజు ముందు డిసెంబర్ 21న షారుఖ్ ఖాన్ డంకీ విడుదల అవుతుంది. షారుఖ్ ఖాన్ చిత్రానికి పోటీగా ఎందుకు విడుదల చేస్తున్నారు? అది కూడా ఒకరోజు తర్వాత, మీకు నష్టం కలిగించే అవకాశం ఉంది కదా? అని అడగడం జరిగింది.
డిసెంబర్ 22 తేదీని కొన్ని నమ్మకాల ఆధారంగా నిర్ణయించాము. మా ప్రతి సినిమా రిలీజ్ కి సెంటిమెంట్స్ ఫాలో అవుతాము. గత 10-15 ఏళ్లుగా మేము ఇదే చేస్తున్నాం. ఆ క్రమంలో సలార్ విడుదల తేదీ ఫిక్స్ చేశాము. డంకీ, ఆక్వామ్యాన్ మా చిత్రం కంటే ఒకరోజు ముందు వస్తున్నప్పటికీ మేము విడుదల తేదీ మార్చాము అని ఆయన చెప్పారు. కాబట్టి న్యూమరాలజీ ఆధారంగా సలార్ విడుదల తేదీ ఫిక్స్ చేశారని క్లియర్ గా తెలుస్తుంది. నిజానికి సలార్ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సింది. ప్రొడక్షన్ పనుల కారణంగా వాయిదా వేశారు.