Sai Pallavi : ఈ జనరేషన్ హీరోయిన్స్ లో సాయి పల్లవి చాలా అరుదైన అమ్మాయి. సిద్ధాంతాలు, విలువలు పెట్టుకొని రాణించిన ఒకే ఒక హీరోయిన్. ఆఫర్స్ వచ్చినా రాకున్నా పద్ధతులు మార్చుకునేది లేదంటుంది. ప్రాధాన్యత లేని పాత్ర సాయి పల్లవి చేయదు. అలాగే పొట్టి బట్టలు వేసి స్కిన్ షో చేయదు. మితిమీరిన శృంగార సన్నివేశాల్లో నటించదు. కేవలం టాలెంట్ తోనే ఆమె అభిమానులను సంపాదించారు. సాయి పల్లవి ఇప్పటి వరకు చేసిన ప్రతి పాత్ర ప్రేక్షకుల మదిలో ముద్ర వేశాయి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి అయినప్పటికీ డబ్బుల కోసం తాపత్రయ పడే రకం కాదు.

సినిమా పరాజయం పొంది నిర్మాత నష్టపోతే రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని పరిశ్రమలో టాక్. కోట్లు ఇచ్చినా నమ్మని విషయాలు ప్రచారం చేయరు. వ్యాపార ప్రకటనల్లో నటించరు. ఇన్ని గొప్ప లక్షణాలు ఎవరికి ఉంటాయి చెప్పండి. తమిళ అమ్మాయి అయినప్పటికీ సాయి పల్లవికి తెలుగులోనే ఫాలోయింగ్ ఎక్కువ. ఫిదా, ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాలతో ఆమె భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది. అలాంటి సాయి పల్లవి సినిమాలు మానేస్తా… అంటే అభిమానులు ఎలా తట్టుకోగలరు చెప్పండి.
సాయి పల్లవి కొత్త సినిమాలకు సైన్ చేసి చాలా కాలం అవుతుంది. డిమాండ్ ఉన్న హీరోయిన్ సినిమాలు చేయడం లేదంటే ఆమె కావాలని మానేసినట్లే లెక్క. ఈ ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది. సాయి పల్లవి సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఎటూ ఎంబిబిఎస్ డిగ్రీ ఉన్న నేపథ్యంలో ఆమె డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలు పెట్టబోతున్నారు. సొంతగా ఒక క్లినిక్ స్టార్ట్ చేయాలన్నది ఆమె ప్రణాళిక అంటూ… లెక్కకు మించిన ఊహాగానాలు తెరపైకి వచ్చాయి.
వీటన్నింటికీ సాయి పల్లవి స్పష్టత ఇచ్చారు. సినిమాలు చేయడం మానేయలేదని ఆమె పరోక్షంగా చెప్పారు. భాషా బేధం లేకుండా మంచి కథ, పాత్రలు వస్తే నటిస్తాను. అందరూ నన్ను తమ సొంతింటి ఆడపిల్లలా భావిస్తారు. నేను చేసే పాత్రలు వారికి నచ్చాలని కోరుకుంటాను, అని చెప్పుకొచ్చారు. బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యం గొప్పదనే కాన్సెప్ట్ తో ప్రేమమ్ మూవీ తెరకెక్కింది. ఆ సినిమా అంత పెద్ద విజయం సాధిస్తుందని నేను అనుకోలేదు. ఆ సినిమాలో నేను చేసిన టీచర్ పాత్ర నుండి బయటకు రావడానికి లవ్, రొమాంటిక్ రోల్స్ చేశానని సాయి పల్లవి చెప్పుకొచ్చారు.