Virataparvam Real Story: చాలా సినిమాలకు నిజ జీవితాలే స్ఫూర్తి. సినిమాలు ఆయా సామాజిక పరిస్థితులు ప్రతిబింబిస్తూ ఉంటాయి. విడుదలకు సిద్దమైన విరాటపర్వం సైతం ఓ రియల్ స్టోరీ కావడం విశేషం. దళం లో చేరిన బావ కోసం ఓ అమ్మాయి దళ సభ్యురాలిగా మారిన ఈ రియల్ స్టోరీ నిజమైన ప్రేమకు నిదర్శనం. రానా-సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా దర్శకుడు వేణు ఉడుగుల తెరక్కించిన విరాటపర్వం చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విరాటపర్వం చిత్రానికి స్ఫూర్తిగా నిలిచిన రియల్ లవర్స్ కథ వెలుగులోకి వచ్చింది.
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం, మడగూడెం కి చెందిన నారాయణ, జజ్జర్ల సమ్మక్క వరసకు బావా మరదళ్ళు. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఊహ తెలిసిన నాటి నుండి సమ్మక్క బావే ప్రాణంగా బ్రతికింది. అతన్ని పెళ్లి చేసుకొని ఆనందకర జీవితం గడపాలని కోరుకుంది. అయితే నారాయణ ఆలోచనలు విప్లవం వైపు అడుగులు వేశాయి. 1991లో హన్మకొండ డిగ్రీ కాలేజీలో చదువు పూర్తి చేసిన నారాయణ విద్యార్థి దశలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్ లో చేరాడు. అనంతరం దళంలో చేరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.
Also Read: Trs vs Bjp vs Congress: తెలంగాణ సర్వే: టీఆర్ఎస్ vs బీజేపీ vs కాంగ్రెస్.. గెలుపెవరిది?
దళంలో చేరిన నారాయణ ఎంతకూ తిరిగి రాలేదు. ప్రాణప్రదంగా ప్రేమించిన సమ్మక్క చేసేది లేక తెగించి… అందరినీ వదిలి అడవుల్లోకి నారాయణను వెతుక్కుంటూ వెళ్ళింది. చివరికి నారాయణను కలుసుకుంది. ప్రేమించిన వాడి భావాలు, ఆలోచనలు, లక్ష్యాలలో భాగమవుతుంది. ఆమె కూడా నక్సలైట్ గా మారి తుపాకి పట్టి ఉద్యమం మొదలెడుతుంది. దీని కోసం తల్లి అవ్వాలనే కోరికను త్యాగం చేస్తుంది. కాగా 2008లో సమ్మక్క అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆమె పోలీసులకు లొంగిపోయారు. ప్రభుత్వం ఆమె పేరిట ఉన్న రూ. 5 లక్షల రివార్డ్ ఆమెకే ఇవ్వడంతో, జబ్బుకు చికిత్స చేయించుకుని కోలుకుంది.
కొన్నాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన సమ్మక్క ప్రేమించిన నారాయణను వదిలి ఉండలేక 2012లో తిరిగి దళంలో చేరింది. కాగా ఈ అమర ప్రేమికులను కరోనా పొట్టనబెట్టుకుంది. 2021లో కరోనా సోకి జూన్ 21న నారాయణ, 24న సమ్మక్క రోజుల వ్యవధిలో మరణించారు. వారి అంత్యక్రియలు దళ సభ్యులు అడవిలోనే పూర్తి చేశారు. అలా వారి కథ ముగిసింది.
Also Read:Somu Veerraju: సోము వీర్రాజుపై కేసు.. కారణం అదేనట? అర్ధరాత్రి అరెస్ట్ కు ప్లాన్?