Sai Kumar Kannada industry : కన్నడిగులకు అత్యంత భాషాభిమానం, ప్రాంతీయాభిమానం కలిగి ఉంటారు. తమ భాషను ఎవరు తక్కువ చేసి మాట్లాడిన అసలు సహించరు. కావాలనో, అనాలోచితంగానో కొందరు ప్రముఖులు కన్నడ పరిశ్రమను, భాషను ఉద్దేశించి మాట్లాడి కన్నడిగుల వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. తాజాగా కమల్ హాసన్ కన్నడిగుల మనోభావాలను దెబ్బ తీశాడు. థగ్ లైఫ్ ప్రమోషన్స్ లో భాగంగా బెంగుళూరు వెళ్లిన కమల్ హాసన్… కొన్ని అసందర్భ వ్యాఖ్యలు చేశాడు. కన్నడ భాష తమిళ్ నుండే పుట్టింది, అన్నారు. కన్నడకు ఓ ప్రత్యేకమైన భాష కాదన్న అర్థం వచ్చేలా ఉన్న కమల్ వ్యాఖ్యలు వివాదం రాజేశాయి.
కన్నడిగులు ఆయనపై మండిపడ్డారు. కన్నడ భాషను కించపరిచిన కమల్ హాసన్ క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. కర్ణాటక హైకోర్ట్ సైతం కమల్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించింది. కమల్ ఏమైనా చరిత్రకారుడా? భాషా శాస్త్రవేత్తనా? గొప్ప నటుడు అయితే ఎవరికి ఎక్కువ.. అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది. కర్ణాటకలో థగ్ లైఫ్ మూవీ విడుదల నిలిచిపోయింది. అయినా కమల్ హాసన్ తగ్గలేదు. ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇకపై కమల్ సినిమాలు కర్ణాటకలో విడుదల కావడం కష్టమే అని చెప్పొచ్చు.
ఇదే తరహా వ్యతిరేకతను కొన్నేళ్ల క్రితం తెలుగు నటుడు సాయి కుమార్ ఎదుర్కొన్నారు. కన్నడలో స్టార్ గా ఎదుగుతున్న రోజుల్లో కమల్ హాసన్ చేసిన ఓ కామెంట్ కన్నడిగులను ఆగ్రహానికి గురి చేసింది. సాయి కుమార్ పై కన్నడిగులు దాడులకు తెగబడే ప్రయత్నం చేశారు. థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో సాయి కుమార్ నటించిన పోలీస్ స్టోరీ భారీ హిట్. తెలుగులో కూడా ఈ మూవీ ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. తెలుగువాడైన సాయి కుమార్ కి కన్నడలో కెరీర్ ఏర్పడింది.
కాగా ఓ సభలో సాయి కుమార్ తాను గర్భంలో ఉన్నప్పుడే తమిళ సీనియర్ హీరో శివాజీ గణేశన్ అభిమానిని అని చెప్పాడు. ఈ కామెంట్స్ కన్నడిగులను హర్ట్ చేశాయి. కన్నడ ప్రేక్షకులమైన మేము నీకు సపోర్ట్ చేస్తుంటే, నువ్వు తమిళ హీరోని పొగుడుతావా?. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గొప్పతనం మీకు కనిపించలేదా? ఆయన కంటే శివాజీ గణేశన్ గొప్పవాడా? అంటూ కన్నడిగులు నిరసన స్వరం అందుకున్నారు. సాయి కుమార్ మీద దాడికి సైతం యత్నించారు. దాంతో సాయి కుమార్ కన్నడ పరిశ్రమకు దూరం కావాల్సి వచ్చింది. పోలీస్ స్టోరీ అనంతరం ఆయన కొన్ని సినిమాలు హీరోగా చేశాడు. ఆ స్థాయిలో సక్సెస్ కాలేదు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యారు.