Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) రోడ్డు ప్రమాదం పై ఇప్పటికే అనేక కథనాలు వినిపించాయి, అయితే ఆ ప్రమాదం వెనుక అసలు కారణాలను తెలుసుకోవడానికి పోలీసులు ప్రాథమికంగా విచారణ చేపట్టి, ప్రమాదానికి ముఖ్య కారణం బైక్ ను అతి వేగంగా డ్రైవ్ చేయడమే అని అధికారికంగా నిర్ధారించారు.
ఐతే, అతివేగంతో పాటు ప్రమాదం జరిగిన స్థలంలో రోడ్డు పై ఇసుక ఉండటం కూడా ప్రమాదానికి కొంతవరకు కారణం అని పోలీసుల అభిప్రాయం. ఐతే, కేవలం ఇసుక కారణంగానే ప్రమాదం జరిగింది అని పోలీసులు చెప్పలేదు. కాకపోతే, అతి వేగంతో డ్రైవ్ చేయడం వల్ల సాయి తేజ్ బైక్ బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడు.
సరే ఎవరి వాదన ఎలా ఉన్నా… ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ప్రమాదానికి కారణం ఇదే అంటూ మరో భిన్నమైన పాయింట్ ని చెప్పుకొచ్చారు. ఇంతకీ వినాయక్ ఏమి చెబుతున్నాడు అంటే.. సాయి తేజ్ గత కొంతకాలంగా ఫుల్ డైటింగ్ లో ఉన్నాడని… ఫిట్నెస్ కోసం కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తున్నాడని…
బహుశా ఆ ఫీట్ నెస్ కారణంగా వీక్ నెస్ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడని వినాయక్ చెప్పుకొచ్చాడు. కాకపోతే ఇది అంత నమ్మశక్యంగా లేదు లేండి. పనిలో పనిగా వినాయక్ సాయి తేజ్ గురించి రెండు మంచి మాటలు చెబుతూ… సాయి తేజ్ రాష్ డ్రైవింగ్ చేసే వ్యక్తి కాదని వినాయక్ అన్నాడు.
ఇక రోడ్డు పై ఇసుక కూడా పెద్ద ప్రమాదకారమైనది కాదని, కేవలం నీరసం వల్ల సాయి తేజ్ కి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడు అని వినాయక్ చెప్పుకొచ్చాడు. ఇక మీడియా దీన్ని పెద్ద రాద్ధాంతం చేయొద్దని వినాయక్ కోరుకుంటున్నాడు.