మెగా మేనల్లుడిగా ఇండస్ట్రీకి పరిచయమై, తనదైన టాలెంట్ తో దూసుకెళ్తున్న నటుడు సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej). ప్రేక్షకులకు సాయి పరిచయమై ఏడేళ్లు గడిచిపోయాయి. ఈ ఏడేళ్లలో ఏడాదికి రెండు చొప్పున దాదాపు 14 వరకు సినిమాల్లో నటించాడు. ఇందులో సూపర్ హిట్లతో.. భారీ డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అయితే.. తన వద్దకు వచ్చిన కథలను కూడా చాలానే రిజెక్ట్ చేశాడు తేజూ. మరి, ఆ కథలు వేరే వాళ్ల దగ్గరికి వెళ్లాయా? వెళ్తే ఎలాంటి రిజల్ట్ అందుకున్నాయి? అన్నది చూద్దాం.

సాయితేజూ (Sai Dharam Tej)మొదటి సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’. 2014లో రిలీజైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ విధంగా.. సక్సెస్ తో కెరీర్ స్టార్ట్ చేశాడు తేజూ. అయితే.. నిజానికి తేజూ మొదటి చిత్రం ‘రేయ్’. వైవిఎస్ చౌదరి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రారంభమైన తర్వాత పలు ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ కారణంగా పిల్లానువ్వులేని జీవితం ముందుగా రిలీజ్ అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా చిత్రాలనే రిజెక్ట్ చేశాడు సాయిధరమ్.
అందులో టాప్ లో ఉన్న మూవీ ‘శతమానం భవతి’. ఈ చిత్రాన్ని తేజూతోనే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు దర్శకుడు సతీష్ వేగేశ్న. తేజూకు సైతం ఈ స్టోరీ బాగా నచ్చింది. కానీ.. టైమ్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సినిమా చేయలేకపోయాడు. ఆ విధంగా..ఈ మూవీ శర్వానంద్ వద్దకు చేరింది. 2017 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం.. అద్భుతమైన విజయాన్ని సాధించింది. శర్వా కెరీర్ లోనే సూపర్ హిట్ గా నిలిచింది. అలా.. మంచి మూవీని కోల్పోయాడు తేజూ.
సంచలన విజయం సాధించిన ఆర్ఎక్స్ 100 మూవీ కూడా సాయితేజూ చేయాల్సింది. దర్శకుడు అజయ్ భూపతి తేజూతోపాటు చాలా మంది హీరోలకు ఈ కథ చెప్పాడు. కానీ.. చాలా మంది నో చెప్పారు. ఇదే కోవలో తేజూ కూడా రెడ్ సిగ్నల్ చూపించాడు. చివరకు కార్తికేయ వద్దకు చేరింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
సతీష్ వేగేశ్న తెచ్చిన మరో కథను కూడా తేజూ వదిలేసుకున్నాడు. నితిన్ హీరోగా వచ్చిన ‘శ్రీనివాస కల్యాణం’ ముందుగా తేజూ వద్దకే వచ్చింది. ఈ సారి ఎలాగైనా తేజూతో చేయాలని దర్శకుడు గట్టిగానే ట్రై చేశాడు. కానీ.. ఇప్పుడుకూడా టైమ్ అడ్జెస్ట్ కాలేదు. చివరకు నితిన్ తో తెరకెక్కింది. అయితే.. ఫలితం మాత్రం తేడా కొట్టింది.
విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ను శర్వానంద్ తో తెరకెక్కించాలని భావించాడు దర్శకుడు క్రాంతి మాధవ్. కానీ.. శర్వా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. దీంతో.. సాయితేజూ వద్దకు చేరింది. మెగా మేనల్లుడు సైతం ఈ స్టోరీతో కనెక్ట్ కాలేదు. దీంతో.. విజయ్ వద్దకు చేరింది. వారిద్దరి జడ్జిమెంట్ కరెక్ట్ అనిపించేలా.. ఈ మూవీ భారీ డిజాస్టర్ గా మిగిలింది.
తేజూ వదులుకున్న మరో మూవీ ‘కేరింత’. కాలేజీ, ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం.. పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో హీరోగా నటించాలని సాయితేజూను కోరాడట నిర్మాత దిల్ రాజు. అయితే.. ఇంత సాఫ్ట్ స్టోరీలో తాను నటించలేను అని చెప్పాడ తేజూ. ఈ విధంగా.. దాదాపు పది కథలను తిరస్కరించాడు తేజూ. ఇందులో కొన్ని సూపర్ హిట్లు కాగా.. మరికొన్ని భారీ డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి.