
Sai Dharma Tej Accident : మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం చిత్రపరిశ్రమను షాక్ కు గురిచేసింది. అందరితో సౌమ్యంగా మెలిగే సాయికి ఇలా జరగడంతో చాలా మంది తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతోపాటు హితులు, సన్నిహితులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు. అయితే.. ప్రాణానికి ప్రమాదం లేదని అపోలో వైద్యులు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. మరో 48 గంటలపాటు అబ్జర్వేషన్లో ఉంచాలని డాక్టర్లు చెప్పారు.
ఈ రోడ్డు ప్రమాద ఘటనపై రాయదుర్గం పోలీసులు విచారణ చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా.. ఈ యాక్సిడెంట్ శుక్రవారం రాత్రి 8.05 గంటలకు జరిగినట్టుగా భావిస్తున్నారు. ఘటనా స్థలం నుంచి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు.. ఈ ఘటనలో సాయితేజ్ మీద కేసు కూడా నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఓవర్ స్పీడ్ తో వెళ్లి, ప్రమాదానికి కారణమైనందుకుగానూ ఐపీసీ 336, మోటార్ వెహికిల్ యాక్ట్ 184 కింద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.
ఇక, ప్రమాద సమయంలో సాయిధరమ్ తేజ్ నడిపిన బైక్.. అనిల్ కుమార్ బుర్ర అనే పేరు మీద రిజిస్టర్ అయినట్టు సమాచారం. ఇది చాలా ఖరీదైన బైక్ అని, దీని విలువ దాదాపు రూ.18లక్షల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 1160 సీసీ ట్రిపుల్ ఇంజిన్ కలిగిన ఈ బైక్ క్షణాల్లోనే వంద కిలోమీటర్ల వేగం అందుకుంటుందని అంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి బైకులు చాలా తక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. ఓవర్ టేక్ చేసే సమయంలో బండిని వంచడం, అది బలమైన వెహికిల్ కావడంతో.. స్కిడ్ అయిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇదిలాఉంటే.. ఈ బైక్ పై ఒక ట్రాఫిక్ చలానా పెండింగ్ లో ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్టు 2వ తేదీన ఆ చలాన్ పడింది. ఈ చాలానా పడడానికి కారణం ఓవర్ స్పీడ్ గా తెలుస్తోంది. ఈ చలానా కింద 1,035 రూపాయలు చెల్లించాల్సి ఉంది. యాక్సిడెంట్ అయిన సమయంలో ఈ-చలాన్ పోర్టల్ లో ఈ మొత్తం చూపించింది. అయితే.. గంట తర్వాత పెండింగ్ చలానా ఉన్నట్టుగా చూపించట్లేదు. మొత్తం క్లియర్ అయినట్టుగా చూపించింది. అయితే.. వివాదానికి అవకాశం ఇవ్వొద్దనే ఉద్దేశంతో.. వెంటనే ఆ చలానాను క్లియర్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. కుటుంబ సభ్యుల్లో ఎవరు ఈ మొత్తాన్ని చెల్లించారనేది మాత్రం తెలియలేదు.