Rajamouli RRR 2 : రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ప్రకటించడం సంచలనంగా మారింది. నిజానికి ప్రేక్షకుల్లో ఆర్ ఆర్ ఆర్ పార్ట్ 2 పై ఆసక్తితో ఉన్నారు. రాజమౌళిని ఇదే విషయం అడిగితే ఆయన స్పష్టమైన ప్రకటన చేయలేదు. తాజాగా ఆయన ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ ఉంటుందని చెప్పడం చిత్ర వర్గాల్లో చర్చకు తీసింది. ఆర్ ఆర్ ఆర్ పార్ట్ 2 ఉంటుంది. రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేస్తున్నారని రాజమౌళి చెప్పడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ క్రమంలో అసలు పార్ట్ 2 కథ ఏంటి? హీరోలుగా మళ్ళీ ఎన్టీఆర్, రామ్ చరణ్ లనే తీసుకుంటారా? ఏ నేపథ్యంలో మూవీ ఉంటుందనే? పలు సందేహాలు తెరపైకి వచ్చాయి.

నిజానికి ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ లో సీక్వెల్ కోసం ఎలాంటి లీడ్ ఇవ్వలేదు. ఇద్దరి లక్ష్యం నెరవేరినట్లు చూపించాడు. బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ప్రతి ఒక్కరికి ఆయుధం ఇవ్వాలనే రామ్ కోరిక తీరింది. మరోవైపు మల్లి భద్రంగా భీమ్ చేతికి చేరింది. ఆర్ ఆర్ ఆర్ క్లైమాక్స్ పరిశీలిస్తే భీమ్ కథ ముగిసింది. రామ్ క్యారెక్టర్ కి మాత్రం లీడ్ ఇవ్వవచ్చు. ఆయుధాగారం కొల్లగొట్టిన రామ్ బ్రిటీషు వారిపై ఎలాంటి పోరాటం చేశాడు. ఆ ప్రభుత్వాన్ని ఎలా ముప్పతిప్పలు పెట్టాడనే కోణంలో కథను పెంచుకుంటూపోవచ్చు.
అయితే ఆర్ ఆర్ ఆర్ కల్పిత కథ కాబట్టి రచయితకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. భీమ్ పాత్రను కథలోకి తీసుకురావడానికి ఆయన ఆసక్తికర మలుపులు రాసుకోవచ్చు. రామ్, భీమ్ బ్రిటీష్ కోటపై దాడి చేశారు కాబట్టి భీమ్ ని వెతుక్కుంటూ సైన్యం అతని వద్దకు వెళ్ళవచ్చు. మరలా రామ్-భీమ్ ఒకరికి మరొకరు తోడై యుద్ధం సాగించవచ్చు. బాహుబలి మాదిరి ఆర్ ఆర్ ఆర్ కి సీక్వెల్ కోసం బలమైన లీడ్ లేదు. అయినప్పటికీ కథను విస్తరించుకునే పరిధి ఉంది. స్వాతంత్య్రం రావడానికి పాతికేళ్ల ముందు జరిగిన కథగా చూపించారు కాబట్టి, బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం నేపథ్యంలో ఎలాంటి కథనైనా రాసుకోవచ్చు.
మరి సీక్వెల్ కోసం కూడా రాజమౌళి ఛాయిస్ ఎన్టీఆర్, రామ్ చరణ్ అవుతారా? లేక మరో ఇద్దరు స్టార్స్ తో చేస్తారా? అనేది ఆసక్తికరం. అయితే భీమ్, రామ్ పాత్రల్లో ఎన్టీఆర్-రామ్ చరణ్ అద్భుతం చేశారు. ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. కాబట్టి రాజమౌళి వారిద్దరినీ కాదని వేరే హీరోలతో చేసే సాహసం చేయకపోవచ్చు. ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన వారిద్దరినీ మారిస్తే మైనస్ కావచ్చు. కాగా ఆర్ ఆర్ ఆర్ సీక్వెల్ కార్యరూపం దాల్చడానికి కనీసం ఐదేళ్లు సమయం పడుతుంది. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న మహేష్ మూవీ పూర్తి చేసి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సెట్స్ పైకి తీసుకెళ్లడం ఇప్పట్లో అయ్యేది కాదు.