RK Roja , Srikanth and Rashi
RK Roja : ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా.. జబర్దస్త్ వేదికగా చేసిన సంచలనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మోస్ట్ పాప్యులర్ కామెడీ షో జబర్దస్త్ కి ఆమె కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. 2013లో ప్రయోగాత్మకంగా జబర్దస్త్ మొదలైంది. మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు కాగా.. ఈ షో ఈటీవీలో ప్రసారం చేస్తున్నారు. రోజా, నాగబాబు జడ్జెస్ గా అనసూయ యాంకర్ గా ఆరంభమైన ఈ షోలో అనేక రికార్డులు బద్దలు కొట్టింది. రికార్డు టీఆర్పీ రాబట్టింది. జబర్దస్త్ షో అనేక మంది సామాన్యులను స్టార్స్ ని చేసింది.
రాజకీయాల్లో రాణిస్తూనే రోజా జబర్దస్త్ జడ్జిగా కొనసాగారు. జబర్దస్త్ తో పాటు ఈటీవీలో ప్రసారమయ్యే పలు స్పెషల్ ఈవెంట్స్, షోలలో రోజా సందడి చేసేవారు. గత ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఆమెకు దక్కింది. దాంతో అయిష్టంగానే జబర్దస్త్ షోని వీడింది. బుల్లితెరకు పూర్తిగా దూరమైంది. 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. రోజా సైతం ఓడిపోయారు. దాంతో రోజా రీ ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలు పుకార్లు గానే మిగిలిపోయాయి.
ఎట్టకేలకు రోజా రీఎంట్రీ ఇచ్చారు. అయితే ఆమె జబర్దస్త్ కి జడ్జిగా రావడం లేదు. జీ తెలుగులో కొత్తగా ప్రసారం కానున్న షోకి రోజా జడ్జిగా వ్యవహరించనున్నారు. జీ తెలుగులో ప్రసారం అవుతున్న 16 సీరియల్స్ నటులు ‘సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్’ షోలో పోటీ పడనున్నారు. ఈ షో మార్చ్ 2 నుండి ప్రారంభం కానుంది. సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ షో గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ప్రోమో విడుదల చేశారు. వేదికపై రోజాతో పాటు శ్రీకాంత్, రాశి కనిపించారు. ఈ ముగ్గురు ఈ షోకి జడ్జెస్ గా వ్యవహరించనున్నారని తెలుస్తుంది.
రోజా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయినప్పటికీ… జబర్దస్త్ షోతో ఆమె మరింతగా జనాల్లోకి వెళ్లారు. ఈ జనరేషన్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాంటి జబర్దస్త్ కి హ్యాండ్ ఇచ్చిన రోజా, కొత్త షోతో రీఎంట్రీ ఇవ్వడం చర్చకు దారి తీసింది. ప్రస్తుతం శివాజీ, కుష్బూ జబర్దస్త్ జడ్జెస్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.