Vallabhaneni Vamsi Case
Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీని మూడు రోజులపాటు పోలీస్ కస్టడికి అనుమతి ఇస్తూ ఎస్సీ ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది.. మూడు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వల్లభనేని వంశీని విచారించాలని సూచించింది. వంశీ న్యాయవాదులు సూచించిన విధంగా వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సౌకర్యం కల్పించాలని న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది. వల్లభనేని వంశీని ఆయన న్యాయవాది సమక్షంలోనే విచారించాలని.. కోర్టు నిబంధనల లోబడి విచారణ ప్రక్రియ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. వల్లభనేని వంశీని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల ఏపీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు వల్లభనేని వంశీకి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈ కేసును విచారించిన ఎఫ్సీ ఎస్టీ కోర్టు.. ఏపీ పోలీసులు కోరినట్టుగానే మూడు రోజులపాటు కస్టడీ కి అనుమతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వంశీని ఆయన న్యాయవాది సమక్షంలోనే విచారించాలని.. 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే విచారణ ప్రక్రియ జరగాలని.. వంశీ కోరుకున్నట్టుగా వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సౌకర్యం కల్పించాలని సూచించింది..
ఏం రాబడతారు?
టిడిపి కార్యాలయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో దాడి జరిగింది. నాటి దాడికి వైసిపి నాయకులు కారణమని టిడిపి నాయకులు అప్పట్లో ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని నాటి డిజిపిని కలిశారు. అయినప్పటికీ ఆ కేసులో ముందడుగు పడలేదు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి కార్యాలయం పై దాడి జరిగిన కేసును తిరగతోడింది. నాడు టిడిపి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్న సత్య వర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వల్లభనేని వంశీ పై కేసు నమోదయింది. ఆ తర్వాత సత్య వర్ధన్ ను వల్లభనేని వంశీ అనుచరులు అపహరించారని.. అందువల్లే అతడు ఫిర్యాదును వెనక్కి తీసుకున్నాడని టిడిపి నేతలు ఆరోపించడం మొదలుపెట్టారు. దీంతో ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో సత్య వర్ధన్ ఫిర్యాదు చేయడంతో వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు ఇటీవల హైదరాబాద్ లోని రాయదుర్గం ప్రాంతంలో వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. ఆ తర్వాత విజయవాడకు తీసుకువచ్చారు. న్యాయమూర్తి ఎదుట ఆయనను ప్రవేశపెట్టడంతో.. న్యాయమూర్తి సూచనల మేరకు ఆయనకు జ్యూడిషల్ రిమాండ్ విధించారు. ఇటీవల వల్లభనేని వంశీని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. కేసులకు భయపడవద్దని.. తను అండగా ఉంటానని ఆయనకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత విజయవాడ సబ్ జైలు ముందు విలేకరులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కూటమినేతలను బట్టలు ఇప్పి కొడతానని హెచ్చరించారు.