Homeఎంటర్టైన్మెంట్Roja Comments On Balakrishna: ఆ ఒక్క మాటతో పవన్, బాలయ్యల నోళ్లు మూయించిన రోజా..పంచ్...

Roja Comments On Balakrishna: ఆ ఒక్క మాటతో పవన్, బాలయ్యల నోళ్లు మూయించిన రోజా..పంచ్ అదుర్స్

Roja Comments On Balakrishna: అధికారానికి దూరమైన తర్వాత.. నాయకులు ప్రజలకు దగ్గరవ్వాలని చూస్తుంటారు. వారి అభిమానాన్ని పొందాలని ప్రయత్నిస్తుంటారు. వెనుకటి కాలంలో అయితే విస్తృతంగా పర్యటనలు జరిపేవారు. ఇప్పుడైతే మీడియాలో, సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. సంచలన విషయాలను పంచుకుంటున్నారు. మాజీమంత్రి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా కనిపిస్తున్నారు. సంచలన వ్యాఖ్యలు చేస్తూ ప్రచారంలో ఉంటున్నారు. ఇటీవల ఆమె ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూ చేసింది వైసిపి అభిమాని కాబట్టి.. రోజా లో ఉన్న మరో కోణం ఆవిష్కృతం కాలేదు. కాకపోతే ఈ మొత్తం ఇంటర్వ్యూలో రోజా తనని తాను గొప్పగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేశారు. తాను గొప్ప పనులు చేశానని.. తనకు ఓటు వేయకపోవడం ప్రజల దౌర్భాగ్యం అనే లాగా వ్యాఖ్యలు చేశారు. ఇక అందులో రోజా మాట్లాడిన కొన్ని విషయాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.

Also Read: సుకుమార్ వల్లే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడు అంటూ రాఘవేంద్ర రావు వివాదాస్పద వ్యాఖ్యలు!

“తిరుమలలో శ్రీవారి దర్శనాన్ని నేను చాలామందికి దగ్గరుండి చేయించాను. చాలామంది ప్రజాప్రతినిధులు తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనానికి ఎవరైనా వస్తే వారి పీఏ లతో చెప్పిస్తారు. నేను మాత్రం దగ్గరుండి వారిని తీసుకెళ్లి శ్రీవారి దర్శనాన్ని చేయిస్తాను. నా ఫోన్ కూడా నేను నా పీఏకు ఇవ్వను. అది నా దగ్గరే ఉంటుంది. దర్శనానికి సంబంధించి ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా నేనే రెస్పాండ్ అవుతాను. నేనే అన్ని విషయాలు మాట్లాడుతాను. ఇంత చేసిన తర్వాత ఇందులో నాకు వ్యక్తిగతంగా వచ్చేది ఏమంటుంది? నేను వారి దగ్గర నుంచి ఏం తీసుకుంటాను? దేవుడి దర్శనాన్ని కూడా వ్యతిరేక కోణంలో చూస్తారా? రకరకాల ప్రచారాలు చేస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు సబబు” అని ఇంటర్వ్యూలో రోజా ప్రశ్నించారు. తనను అనవసరంగా ఇబ్బంది పెట్టారని.. కావాలని విమర్శలు చేశారని రోజా అన్నారు.

“జబర్దస్త్ షోలో నేను పాల్గొన్నాను. నా కెరియర్ ఒకప్పుడు సినిమా రంగంలోనే మొదలైంది. కాబట్టి దానిని నేను వదులుకోలేను. అప్పుడు జబర్దస్త్ లో నాకు అవకాశాలు కూడా వచ్చాయి. ప్రజా ప్రతినిధిగా ఉండుకుంటూ జబర్దస్త్ లో న్యాయ నిర్ణేతగా పనిచేయడం ఏంటని చాలామంది ప్రశ్నించారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేశారు. అడ్డగోలుగా విమర్శలు చేశారు. ఇప్పుడు నేను దాన్నుంచి బయటికి వచ్చాను. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమా షూటింగ్లలో ఎందుకు పాల్గొంటున్నారు.. హిందూపురం నియోజకవర్గం నుంచి శాసనసభ సభ్యుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ సినిమాలు ఎందుకు చేస్తున్నారు? నాకు ఒక న్యాయం? వారికి ఒక న్యాయమా? నన్ను ప్రశ్నించిన వారు వారిని ఎందుకు ప్రశ్నించడం లేదు? కేవలం రాజకీయంగా నేను ఎదుగుతున్నాను కాబట్టే తట్టుకోలేక ఇలా విమర్శలు చేశారు. కావాలని మొన్నటి ఎన్నికల్లో ఓడించారు. అయినప్పటికీ నేను నా నియోజకవర్గ ప్రజలకు దూరం కాలేదు. దూరమయ్యే అవకాశం కూడా లేదని” రోజా వ్యాఖ్యానించారు.

శాసనసభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొద్ది రోజులు రోజ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఇటీవల కాలంలో వరుస సందర్భాలలో నియోజకవర్గానికి వస్తున్నారు. తన పార్టీకి సంబంధించిన కార్యకర్తల శుభకార్యాలు, ఇతర వేడుకలకు హాజరవుతున్నారు. కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. ఇక ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలను ఆమె ఎండగడుతున్నారు. పార్టీ పిలుపుమేరకు నిరసన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తామే అధికారంలోకి వస్తామని రోజా చెబుతున్నారు. కార్యకర్తల్లో కూడా ధైర్యాన్ని నింపుతున్నారు. పనిలో పనిగా తన అంతర్మాథనాన్ని వెల్లడించడానికి యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. తాజా ఇంటర్వ్యూ కూడా అందులో భాగమేనని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular