Rishabh Pant : తారాజువ్వలాగా టీమిండియాలోకి దూసుకు వచ్చాడు రిషబ్ పంత్. ఎడమచేతి వాటంతో బ్యాటింగ్ చేయడం.. వికెట్ కీపింగ్ లో గోడలా వ్యవహరించడం.. జట్టుకు అవసరమైన సమయంలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడడం.. రిషబ్ పంత్ కు వెన్నతో పెట్టిన విద్య. అందువల్లే అతడిని చాలామంది అభిమానిస్తారు. విపరీతంగా ప్రేమిస్తుంటారు. పిచ్ ఎలాంటిదైనా.. బౌలర్ ఎలాంటివాడైనా.. జట్టు ఎంతటి ప్రమాదకరమైనదైనా రిషబ్ పంత్ కు తెలిసింది కేవలం బాదడమే. అందువల్లే అతడిని ఈ కాలపు ధోని అని పిలుస్తుంటారు. కొన్ని సందర్భాలలో అతడిని కూడా మరిపిస్తుంటాడు.
అనితర సాధ్యమైన వేగంతో క్రికెట్ ఆడే పంత్.. ఎవరికి అందనంతస్థాయిలో బ్యాటింగ్ చేస్తాడు. దూకుడుగా ఉంటాడు. అందువల్లే అతడిని టీమిండియాలో చిచ్చరపిడుగు అని పిలుస్తుంటారు. అటువంటి ఆటగాడు సరిగ్గా రెండున్నర సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చావు చివరి అంచుదాక వెళ్లి వచ్చాడు. ఒకానొక దశలో అతడు బతకడం కష్టమేనని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కొక్క ఆశను కూడ తీసుకుంటూ.. ఒక్కొక్క అడుగును బలంగా వేసుకుంటూ అతడు బతుకు మీద భరోసాని పెంచుకున్నాడు. చివరికి సజీవుడిగా నిలబడ్డాడు. సుదీర్ఘకాలం ఆసుపత్రికి పరిమితమైనప్పటికీ.. బతుకు మీద ఆశను పెంచుకొని మళ్ళీ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అనేక కసరత్తుల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టాడు. ఐపీఎల్ లో లక్నో తరుపున ఆశించిన స్థాయిలో ఆడ లేకపోయాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ సిరీస్లో అదరగొట్టాడు. కానీ అక్కడే అతడు గాయపడ్డాడు.
కాలికి గాయమైన తర్వాత మళ్ళీ ఆస్పత్రికి పరిమితమయ్యాడు. కాస్త గాయం తగ్గిన తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. గాయం పూర్తిగా తగ్గిన నేపథ్యంలో మళ్లీ బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నాడు. గాయం అయిన నేపథ్యంలో వెస్టిండీస్ సిరీస్, ఆసియా కప్ కు అతడు దూరమయ్యాడు. ఇప్పుడు గాయం తగ్గడంతో.. మునుపటి సామర్థ్యాన్ని సాధించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పంత్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో ఈనెల 30 నుంచి మొదలయ్యే నాలుగు రోజుల మ్యాచ్లకు బిసిసిఐ రిషబ్ పంత్ ను సారధిగా ప్రకటించింది.
మొదటి మ్యాచ్ కు..
మాత్రే, జగదీషన్, సుదర్శన్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిధార్, హర్ష్, తనుష్, మానవ్, కాంబోజ్, యష్, బదోని, జైన్ ను తొలి మ్యాచ్ కు ఎంపిక చేసింది.
రెండవ మ్యాచ్ కు
రిషబ్ పంత్ (కెప్టెన్), కేఎల్ రాహుల్, జురెల్, సుదర్శన్, దేవదత్, గైక్వాడ్, హర్ష్, మానవ్, ఖలీల్, బ్రార్, ఈశ్వరన్, ప్రసిద్ కృష్ణ, సిరాజ్, ఆకాష్ లను బీసీసీఐ ఎంపిక చేసింది.