ఇవాళ.. ‘కళ’ కమర్షియల్ హంగులు అద్దుకొని వ్యాపారమైంది గానీ.. అసలు కళ అంటే.. ప్రజల్లో చైతన్యాన్ని నింపేది. బడుగు జీవులకు బతుకు బాటను చూపించేది. అప్పట్లో ప్రజా నాట్యమండళ్లు పాటలు పాడుతూ.. నాటకాలు ప్రదర్శిస్తూ.. ప్రజలను మేల్కొలిపేవి. అయితే.. అది సినిమాగా మారే సరికి కోట్లాది రూపాయల ఖర్చుతో సాగే బిజినెస్ అయ్యింది. అయినప్పటికీ.. ఆర్. నారాయణమూర్తి వంటి వారు సినిమాల ద్వారా కూడా తమ కళను ప్రజలకోసమే అంకితం చేశారు. మిగిలిన వారు కూడా.. అడపాదడపా ప్రజలను మేల్కొలిపే విప్లవ సినిమాలను రూపొందిస్తూనే ఉన్నారు. అయితే.. ఇప్పుడు తెలుగు తెరపై విప్లవ జ్వాల మరింతగా రగులుతోంది. ఆ కాగడాను పట్టుకున్న వారిలో చిరంజీవి, రానాతోపాటు ఇంకా పలువురు ఉన్నారు.
Also Read: ఇంకా.. ఎందుకీ రీమేకులు..? కథలు అరువు తెచ్చుకుంటున్న స్టార్ హీరోలు!
విరాట పర్వంః మహాభారతంలోని ఓ పర్వం పేరిది. ఈ విరాట పర్వంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉంటారు. ఇక్కడి నుంచే కురుక్షేత్ర మహాసంగ్రామానికి సిద్ధమవుతారు పాండవులు. ఈ పేరు పెట్టడం ద్వారా.. అడవుల్లో అన్నలు అజ్ఞాత వాసంలో ఉండి సాగించే పోరాటాన్ని ఆవిష్కరించబోతున్నానని చెప్పకనే చెప్పేశాడు దర్శకుడు వేణు ఉడుగుల. రానా, సాయిపల్లవి, నందితాదాస్, ప్రియమణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో రానా ‘కామ్రేడ్ రవన్న’ పాత్రలో నటిస్తున్నారు.
సమాజంలో ఆర్థిక అసమానతలు మొదలు అడుగడుగునా సాగే దోపిడీ విధానానికి వ్యతిరేకంగా నక్సలైట్లు, మావోయిస్టులు తుపాకులతో అడవుల్లో ఉండి పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆసక్తకరంగా చూపించబోతున్నాడు దర్శకుడు. ‘నీది నాది ఒకే కథ’ అనే చిత్రం ద్వారా అందరి దృష్టినీ ఆకర్షించిన వేణు ఉడుగుల.. ఈ చిత్రం ద్వారా ఏం చేయబోతున్నాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఆచార్యః కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమాలో చిరు, రామ్ చరణ్ నక్సలైట్లుగా కనిపించబోతున్నారు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు వెరీ స్పెషల్ గా ఉంటాయని అంటున్నారు. ఇటీవలే.. ఈ చిత్రానికి సంబంధించిన షూట్ మారేడు మిల్లి అడవుల్లో ముగించారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు.
Also Read: మెగాస్టార్ స్థాయి అతడికి మాత్రమే.. సంచలన వ్యాఖ్యలు చేసిన శర్వా!
అరణ్యః రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా జోలికి వెళ్లకుండా.. తనదైన పంథాలో సినిమాలు చేస్తూ విలక్షణ నటుడిగా ముందుకు సాగుతున్నారు రానా. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న చిత్రం ‘అరణ్య’. మార్చి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అడవులను నాశనం చేస్తున్న, అందులోని జంతువులను వేటాడుతున్న అక్రమార్కులపై పోరు సాగించే వీరుడిగా రానా కనిపించబోతున్నారు. ఈ సినిమాలో కొంత భాగం విప్లవ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. స్వార్థ రాజకీయ నాయకులను దునుమాడే సాయుధ దళాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్టు సమాచారం.
ఇవేకాకుండా.. ఇటీవల వచ్చిన జార్జిరెడ్డి, దళం, స్టోరీ ఆఫ్ భీమాల్ వంటి సినిమాలు కూడా విప్లవ నేపథ్యంతోనే తెరకెక్కాయి. మరి, ఇప్పుడు రాబోతున్న సినిమాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి. విప్లవం అంటే మార్పు. తెలుగు ఇండస్ట్రీల్లో కొనసాగుతున్న ఈ మార్పు ఎంత కాలం కొనసాగుతుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Revolutionary flame on the silver screen chiru rana and more
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com