https://oktelugu.com/

Revanth Reddy vs Allu Arjun : రేవంత్ రెడ్డి వైల్డ్ ఫైర్.. టాలీవుడ్ తో తెగదెంపులే!

పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట వల్ల రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్ హాస్పిటల్లో వెంటిలేటర్ మీద నిన్నటిదాకా చికిత్స పొందాడు. ప్రస్తుతం స్వతహాగా శ్వాస తీసుకుంటున్నాడు..

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 21, 2024 / 10:10 PM IST

    Allu Arjun

    Follow us on

    Revanth Reddy vs Allu Arjun : పుష్ప సినిమా వ్యవహారం గత శనివారం అల్లు అర్జున్ అరెస్ట్ చోటు చేసుకోగా.. ఈ శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మరింత దుమారాన్ని రేపింది. ఈ విషయం వైల్డ్ ఫైర్ లాగా రూపాంతరం చెందింది. రేవంత్ రెడ్డి నిండు శాసనసభలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇకపై ప్రత్యేక షో లకు, రాయితీలకు అనుమతి లభించేది కష్టమే. ఇది నిర్మాతలకు చేదు గుళిక లాంటి వార్త.. సినిమా తీసుకునే విషయంలో.. వ్యాపారం చేసే విషయంలో.. రాయితీలు స్వీకరించే విషయంలో ఏ మాత్రం తేడా ఉండదని.. ప్రజలు ప్రాణాలను పోయే పరిస్థితి కనుక వస్తే చూస్తూ ఉండబోమని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.. అంతేకాదు తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు.. ప్రజల రక్షకుడిగా మాత్రమే ఉంటానని రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడటం చిత్ర పరిశ్రమ పెద్దలకు కంటిమీద కునుకు ఉండనీయడం లేదు.ఈ లెక్కన చూస్తే టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇకపై టాలీవుడ్ పెద్దలు తమ గొంతెమ్మ కోరికలను తీర్చుకోవడం కష్టంగానే అనిపిస్తోంది. ఏదైనా కావాలని అడిగే స్వేచ్ఛాయుత వాతావరణ కూడా లేనట్టు తెలుస్తోంది. పుష్ప -2 వల్ల పరిస్థితిలో అధ్వానంగా మారిపోయాయి.

    ఆ ప్రమాదం వల్ల..

    సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన వల్ల ఒక మహిళ కన్ను మూసింది. ఆమె కుమారుడు నరకం చూస్తున్నాడు. ఈ ఘటనలోనే అల్లు అర్జున్ పోలీసుల చేతిలో అరెస్టు గురయ్యాడు. ఆయన అరెస్టు అయిన కొద్ది గంటల్లోనే బెయిల్ లభించింది. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పెద్ద పెద్ద వ్యక్తులు మొత్తం అల్లు అర్జున్ ను పరామర్శించారు. పెద్ద పెద్ద హీరోలు అతడిని పరామర్శించడానికి బారులు తీరారు. ఈ కార్యక్రమాన్ని మీడియా లైవ్ ప్రసారం చేయడంతో చాలామంది విమర్శలు చేశారు. అల్లు అర్జున్ ను కలిసినప్పుడు కథానాయకులు మొత్తం సరదాగా నవ్వుకోవడం.. అదొక సినిమా సెలబ్రేషన్ ఈవెంట్ లాగా కనిపించింది. ఇది సహజంగానే ప్రభుత్వానికి ఆగ్రహాన్ని తెప్పించింది. ఒక మహిళ చనిపోయిన తర్వాత.. ఒక పిల్లవాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సమయాన.. ఇది ఒక సెలబ్రేషన్ లాగా కనిపించడం ప్రభుత్వానికి కోపాన్ని తెప్పించింది. అందువల్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేశంగా మాట్లాడారు. సినిమా పెద్దలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. ఇదే క్రమంలో తనకు ప్రజల ప్రాణాలు మాత్రమే ముఖ్యమని.. ఇలాంటి ఘటనలు జరిగితే చూస్తూ ఊరుకోబోనని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రీమియర్ షోలకు అనుమతులు.. రాయితీల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేశారు.

    మూడు పెద్ద సినిమాలు

    వచ్చే ఏడాది ప్రారంభంలో సంక్రాంతి సందర్భంగా మూడు పెద్ద సినిమాలు విడుదల కానున్నాయి. వాటికి ప్రీమియర్ షో అనుమతులు తెచ్చుకోవడానికి నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పుష్ప సినిమా విడుదల సందర్భంగా చోటు చేసుకున్న ఈ ఘటన తర్వాత ప్రభుత్వం ప్రీమియర్ షో లకు అనుమతులు ఇవ్వడం కష్టంగానే కనిపిస్తోంది. టికెట్ రేట్ పెంచుకునే విషయంలోనూ అదేవిధంగా వ్యవహరిస్తుందని తెలుస్తోంది. అవార్డుల విషయంలోనూ చిత్ర పరిశ్రమ మాట్లాడుకోవడం అనవసరమని రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యల ద్వారానే చెప్పేశారు. గత కెసిఆర్ ప్రభుత్వం పేరుకు తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించినప్పటికీ.. ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉండే తెలుగు చిత్ర పరిశ్రమతో అంట కాగేది. కెసిఆర్ హయాంలో ఎటువంటి అవార్డులు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తామని చెప్పినప్పటికీ.. పుష్ప సినిమా ఉదంతం తర్వాత.. అవార్డుల గురించి ఇప్పట్లో ప్రస్తావించే అవకాశం లేదని సమాచారం.