https://oktelugu.com/

Revanth Reddy Vs Allu Arjun : రేవంత్ రెడ్డి vs అల్లు అర్జున్.. ఎవరి వాదనలో నిజముంది?

"సులభంగా అవుతుందనుకుంటే.. భారీగానే అయిపోయింది. ఇదంతా ఎక్కడికో వెళ్తోంది.." ఆ మధ్య విడుదలైన ఓ తెలుగు సినిమాలో డైలాగ్ ఇది.. ఇప్పుడు ఇది ఇటీవల సంధ్య థియేటర్ లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి నూటికి నూరుపాళ్లు సరిపోతుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 21, 2024 / 10:03 PM IST

    Revanth Reddy Vs Allu Arjun

    Follow us on

    Revanth Reddy Vs Allu Arjun :  ఎక్కడ మొదలైందో తెలియదు.. ఎక్కడికి వెళ్తోందో అర్థం కావడం లేదు. ఎవరు వ్యక్తిగతంగా తీసుకున్నారు తెలియడం లేదు. ఎవరు బాధ్యత మోస్తున్నారు అంతుబట్టడం లేదు. చినికి చినికి గాలివాన లాగా మారిపోయి.. వివాదం నానాటికీ జటిలం అవుతూనే ఉంది. నాడు సంధ్య థియేటర్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీ తేజ్ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. వాస్తవానికి రేవతి కుటుంబానికి సామాన్య నేపథ్యం ఉంది. వారి ప్రాణాలకు మీడియా విలువ ఇవ్వలేదు. అంత పెద్ద సినిమా విడుదలయితే ఎందుకు వచ్చారు? అందుకోసమే చచ్చారు? అన్నట్టుగా మీడియా రిపోర్టు ఇచ్చింది. కానీ అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కసారిగా తీన్ మారిపోయింది. అర్జున్ ను ఎందుకు అరెస్ట్ చేసామో.. అనే విషయంపై పోలీసులు బలమైన వాదన వినిపించారు.. ప్రీమియర్ షో సందర్భంగా వేలకు వేలు పోసి టికెట్లు కొనుగోలు చేసిన వారిని అల్లు అర్జున్ బౌన్సర్లు బయటికి తోసేసారని.. తొక్కిసలాట జరిగేలాగా చేశారని శనివారం శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఒకరు చనిపోయారని చెప్పినా.. ఏ మాత్రం పట్టించుకోకుండా ర్యాలీగా వెళ్లారని రేవంత్ రెడ్డి శాసన సభ వేదికగా వెల్లడించారు. అయితే ఆ ఘటన గురించి తనకు తెలియదని.. తనకు ఆ విషయంపై పోలీసులు చెప్పలేదని.. తన వ్యక్తిగత జీవితాన్ని హననం చేసే కుట్ర జరుగుతోందని అల్లు అర్జున్ అంటున్నారు.. ఈ వ్యవహారాన్ని కంటే ముందు భారత రాష్ట్ర సమితి, ఇంకా కొన్ని రాజకీయ పార్టీలు రంగంలోకి వచ్చాయి. సామాజిక మాధ్యమాలలో తమ సైన్యాలను దింపేశాయి. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. ఈ వ్యవహారం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం ఒక్కసారిగా వైల్డ్ ఫైర్ లాగా మారిపోయింది.

    రాజకీయ పార్టీల మధ్య..

    అవకాశం దొరికితే.. దానిని రాజకీయ లాభం కోసం వాడుకోవడానికి పార్టీలు ఎదురు చూస్తుంటాయి. ఇప్పుడు సంధ్య థియేటర్ ఎపిసోడ్ కూడా అలానే రూపాంతరం చెందింది. అల్లు అర్జున్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. శాసనసభలో రేవంత్ రెడ్డి కూడా గట్టిగానే మాట్లాడారు. కాలు విరిగిందా? దెబ్బలు ఏమైనా తగిలాయా? అన్నట్టుగా సినీ నటులు పరామర్శిస్తున్నారని.. శ్రీ తేజ్ ను ఎందుకు పరామర్శించలేకపోతున్నారని ఆరోపించారు. మరోవైపు అల్లు అర్జున్ కూడా వెంటనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. జరిగిన ఘటన విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూస్తే అల్లు అర్జున్ ను రాజకీయ పార్టీలు తన లాభం కోసం వాడుకున్నట్టు కనిపిస్తోంది.. కాంగ్రెస్ పార్టీ, సోషల్ మీడియా వింగ్ అల్లు అర్జున్ ను అమాంతం విమర్శిస్తుండగా.. ఆశ్చర్యకరంగా భారత రాష్ట్ర సమితి అల్లు అర్జున్ ను వెనకేసుకొస్తుండడం విశేషం. గత శనివారం అరెస్టు ఘటన చోటు చేసుకోగా.. మళ్లీ ఈ శనివారం శాసనసభలో సంధ్య థియేటర్ విషయం చర్చకు రావడం గమనార్హం. అల్లు అర్జున్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా విమర్శలు చేసిన నేపథ్యంలో.. ఈ కేసు మరింత జటిలం అవునుందని తెలుస్తోంది.