కరోనా మహమ్మారి విలయతాండవం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కరోనా విసురుతున్న పంజా నుండి తప్పించుకోలేక ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఒకపక్క ఆసుపత్రుల్లో కరోనా పేషేంట్స్ కి బెడ్స్ సరిగ్గా దొరకడం లేదు, మరోపక్క బెడ్స్ దొరికిన వారికీ సమయానికి ఆక్సీజన్ అందక కన్నుమూస్తున్న బాధాకరమైన సంఘటనలు కనిపిస్తున్నాయి.
నిత్యం ఈ హృదయ విదారకర సంఘటనలు సర్వసాధారణం అయిపోతున్న పరిస్థితుల్లో.. ప్రజలకు దైర్యం చెప్పడానికి కొందరు సినీ ప్రముఖులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రియల్ హీరో సోనూ సూద్ ప్రత్యేకంగా కోవిడ్ బాధితులకు సేవ చేస్తున్నాడు. కాగా తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా తన వంతుగా కరోనా బాధితులకు సేవ చేయాలనే సదుద్దేశ్యంతో ముందుకొచ్చింది.
ఈ కరోనా కష్టకాలంలో ప్లాస్మా, ఆక్సిజన్, మెడిసిన్ ఇలా ఎలాంటి అవసరం ఉన్నా సరే, అలాంటి వాళ్లు తనకు మెసేజ్ చేస్తే సహాయం చేసేందుకు తానూ రెడీగా ఉన్నానంటూ లైవ్ వీడియో ద్వారా రేణు దేశాయ్ సందేశమిచ్చారు. ఆమె మాటల్లోనే.. ‘కరోనా నివారణ విషయంలో గవర్నమెంట్ తీసుకుంటున్న చర్యలు సరిపోవడం లేదని, నేను కూడా ముందుకొచ్చాను. నిజంగా కష్టాల్లో ఉన్నవాళ్లు, చాల అవసరం ఉన్నవాళ్లు మెసేజ్ చేయండి.
కరోనా బాధితులకు సరైన వైద్య సదుపాయాలు అందకపోతే సాయం చేయడానికి నెను రెడీగా ఉన్నాను. అయితే, దయచేసి ఎవ్వరూ డబ్బు అడగొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి. డబ్బు ఇచ్చి చాలాసార్లు నేను మోసపోయాను. డొనేషన్స్ అంటూ చాలామంది చీట్ చేయడం జరిగింది. కాబట్టి, ప్లాస్మా, ఆక్సీజన్, బెడ్స్ లాంటి అవసరాలు ఉన్న వాళ్ళు మాత్రమే సాయం అడగండి’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు.