Homeఎంటర్టైన్మెంట్Razakar Teaser: రజాకర్‌ టీజర్‌ తో కేటీఆర్‌ లో భయం మొదలయిందా?

Razakar Teaser: రజాకర్‌ టీజర్‌ తో కేటీఆర్‌ లో భయం మొదలయిందా?

Razakar Teaser: తెలంగాణ రాజకీయాల్లో రజాకార్‌ మూవీ పొలిటికల్‌ కాంట్రవర్సీగా మారుతోంది. ఎన్నికల వేళ ఈ మూవీ విషయంలో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య డైలాగ్‌ వార్‌ నడవడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవం పరస్కరించుకుని రజాకార్‌ సినిమా టీజర్‌ను మూవీ మేకర్స్‌ విడుదల చేశారు.

కేటీఆర్‌ స్పందన..
రజాకార్‌ టీజర్‌పై తెలంగాణ ముఖ్యమైన మంత్రి కె.తారకరామారావు స్పందించారు. రజాకార్‌ మూవీ టీజర్‌ సమాజంలోని కమ్యూనిటీస్‌ మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. అందువల్ల ఈ సినిమా రిలీజ్‌ను ఆపడం ద్వారా శాంతిభద్రతలను కాపాడాలని ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశాడు. సీఎం, కేటీఆర్, బీఆర్‌ఎస్‌ ట్విట్టర్‌ అకౌంట్లకు ట్యాగ్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై రియాక్ట్‌ అయిన కేటీఆర్‌ ‘రాష్ట్రంలో తమ రాజకీయ ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి బీజేపీకి చెందిన కొంతమంది మేధావులు దివాళా తీసిన జోకర్లు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు. తెలంగాణ శాంతిభద్రతల పరిస్థితి దెబ్బతినకుండా చూసేందుకు సెన్సార్‌ బోర్డుతోపాటు తెలంగాణ పోలీసులతో కూడా మేము ఈ విషయాన్ని తీసుకుంటాం’ అని ట్వీట్‌ చేశాడు.

కేటీఆర్‌కు ‘బండి‘ కౌంటర్‌..
కేటీఆర్‌ ట్వీట్‌పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కౌంటర్‌ ఇచ్చారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరుపుతామని తొలుత వాగ్దానం చేసిన వారు ఇప్పుడు ట్రాక్‌ మార్చారని, తాజాగా రజాకార్ల వాస్తవాలను చూపించినప్పుడు ట్విట్టర్‌ టిల్లు (ఎక్స్‌ టిల్లు)కు ప్రాబ్లెమ్‌గా ఉందని మండిపడ్డారు. ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమేనని సెటైర్‌ వేశారు. హిందువుల పండుగ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పలేదు కానీ రజాకార్ల హిందూ మారణహోమాన్ని చూపించిన సినిమాపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడని ఎద్దేవా చేశారు. చరిత్రను తుడిచిపెట్టే పనికిమాలిన ప్రయత్నాలకు బదులు ఎక్స్‌ టిల్లుకు కొంత స్పృహను కలిగించమని అందరం గణేశుడిని ప్రార్థిద్దాం అంటూ కౌంటర్‌ వేశారు.

ఎన్నికల వేళ కాంట్రవర్సీ..
‘రజాకార్‌ –ది సైలెంట్‌ జెనోసైడ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’ సినిమా మొదటి నుంచి వివాదాస్పదంగా మారింది. ఈ సినిమా అనౌన్స్‌ నాటి నుంచి టీజర్‌ వరకు అభ్యంతరాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. తమను టార్గెట్‌ చేసే ఈ సినిమా తీశారని ఓ వర్గం పెద్దలు ఆరోపిస్తుంటే నిజాం పరిపాలన నాటి వాస్తవాలను మాత్రమే చూపించే ప్రయత్నం చేస్తున్నామని మూవీ యూనిట్‌ చెబుతున్నది. గత జూలైలో ఈ సినిమా పోస్టర్‌ను మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, ఎంపీ బండి సంజయ్‌ తదితరులు ఆవిష్కరించారు. అప్పుడు కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కాగా, తాజాగా టీజర్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కేటీఆర్‌కు భయమా..
ఇదిలా ఉండగా, రజాకార్‌ టీజర్‌పై ఎంఐఎం, ముస్లిం మత పెద్దల కన్నా ముందే.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమైన మంత్రి కేటీఆర్‌ స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎవరి కోసం కేటీఆర్‌ రజాకార్‌ సినిమాను వ్యతిరేకిస్తున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. రజాకార్‌ విడుదలైతే దాని ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని భయపడున్నారా అన్న సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. కశ్మీర్‌ ఫైల్స్, ది కేరళ స్టోరీ సినిమా విడుదల సమయంలో కూడా కొంతమంది వ్యతిరేకించారు. కానీ సినిమాలు విడుదలయ్యాయి. సక్సెస్‌ అయ్యాయి. ఎలాంటి అల్లర్లూ జరుగలేదు. ఈ నేపథ్యంలో రజాకార్‌ కూడా నచ్చితే చేస్తారు లేకుంటే పోతుంది. అంతే కానీ.. కేటీఆర్‌ ఈ సినిమాను మతం కోణంలో చూడడం, ఆమేరకు ట్వీట్‌ చేయడం విమర్శలకు తావిస్తోంది. టీజర్‌ విషయంలో మంత్రి కేటీఆర్‌ ఏకంగా బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించడంతో సినిమా దుమారం రాబోయే ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపనుంది అనేది చర్చనీయాంశంగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular