టాలీవుడ్ లో స్టార్ హీరోలు గత కొంతకాలంగా కొంత భాగాన్ని పారితోషికంగా, అలాగే మరి కొంత భాగాన్ని లాభాల్లో వాటా రూపంలో తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ట్రెండ్ ను ప్రవేశ పెట్టింది మహేష్ బాబునే. తాను నటిస్తున్న ప్రతి సినిమాని తన సొంత నిర్మాణ సంస్థ జిఎంబీ ఎంటర్ టైన్మెంట్స్ కి లింక్ పెట్టి, నిర్మాణ వ్యవహారాల్లో తల దూర్చి, సినిమా హిట్ అయితే మంచి వాటా తీసుకుంటున్నాడు మహేష్.
ఒకవేళ సినిమా ఫట్ అయితే ఎలాగూ సగం రెమ్యునరేషన్ ను ముందే తీసుకుంటున్నాడు కాబట్టి… ఏ రకంగా చూసుకున్న అందరి హీరోల కంటే మహేష్ కే ఎక్కువ మిగులుతుంది. ఇది గమనించిన మిగతా హీరోలు కూడా ఇప్పుడు ఇదే ఫార్ములాని నమ్ముకుంటున్నారు. కాగా తాజాగా మాస్ మహారాజా రవితేజ కూడా మహేష్ నే ఫాలో అవుతున్నాడు.
రవితేజ నటిస్తున్న కొత్త సినిమా నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతుంది. ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి సుధాకర్ చెరుకూరి నిర్మాత. ‘పడి పడి లేచే మనసు’తో బాగా పడిపోయిన ఈ నిర్మాత, ప్రస్తుతం చేస్తోన్న ‘విరాట పర్వం’తో కూడా బాగానే లాస్ అయ్యాడు. అయినా సినిమాల మీద ఆసక్తితో వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలో రవితేజతో కూడా ఒక సినిమా చేస్తున్నాడు. అయితే రవితేజ పూర్తి డబ్బు మనిషి అని పేరు. అందుకే రవితేజతో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు సుధాకర చెరుకూరి. సినిమాకి వచ్చే లాభాల్లో వాటా ఇవ్వడం అనేది ఒప్పందం. ముందుగా ఏడు కోట్లు రెమ్యూనరేషన్ ఉంటుంది. అలాగే రవితేజ కూడా సహా నిర్మాతగా తన బ్యానర్ పేరును వేసుకోవచ్చు. అన్నట్లు ఇటీవల రవితేజ తన నిర్మాణ కంపెనీని స్థాపించారు లేండి.