‘అల్లరి అల్లుడు’ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు అవి. హైదరాబాద్ లో షెడ్యూల్ ప్లాన్ చేశారు. విలక్షణ నటుడు రావు గోపాలరావు ( Rao Gopal Rao) గారు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దాంతో ఆయన షూట్ కోసం మద్రాసు నుండి హైదరాబాద్ కి రావాల్సి వచ్చింది. అయితే, ఆయన హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ‘ప్రశాంత కుటీర్’ అనే హోటల్ లోనే దిగేవారు. అప్పట్లో సినిమా వాళ్లకు అది అడ్డా.
పైగా రావు గోపాలరావు గారు హైదరాబాద్ ఎప్పుడొచ్చినా ఫ్యామిలీతో రావడం ఆయనకు అలవాటు. ప్రశాంత కుటీర్ లో దిగగానే ఆయనకు ఎవరో చెప్పారట. నాలుగో నంబర్ రూమ్ లో నటుడు కోట శ్రీనివాసరావు ఉన్నాడని. రావుగోపాలరావుగారు ఫ్యామిలీని రూమ్ కి వెళ్లిపోమని, వెంటనే కోట రూమ్ దగ్గరకి వెళ్లి, కాలింగ్ బెల్ కొట్టారు. కోట (Kota Srinivas Rao) తుండుగుడ్డ చుట్టుకుని డోర్ ఓపెన్ చేశాడు, ఎదురుగా ఈయన.
కోట టెన్షన్ ఫీల్ అవుతూ.. ‘అయ్యో గురువుగారు మీరా..? ఎవరో క్లినర్ అనుకుని’ అని నసుగుతూ గబగబా వెళ్లి బట్టలు వేసుకుని.. ఎదురుగా ఉన్న రావుగోపాలరావు గారికి మర్యాద చేస్తూ కుర్చీ వేసి కుశల ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. రావు గోపాలరావు గారు ఏమి మాట్లాడకుండా కాసేపు అలాగే చూస్తూ… ‘కోటయ్య, నిన్ను చూడాలని వచ్చాను’, నీకు కుదిరితే రెండు ముక్కలు మాట్లాడి వెళ్తాను’ అన్నారు.
‘అయ్యో, మీరు కబురు పంపితే నేనే మీ దగ్గరకు వచ్చేవాడిని కదా సర్’ అంటూ కోట ఎదురుగా కూర్చుండిపోయాడు. ఎందుకంటే కోట, పరిశ్రమలో రాకముందు నుండే.. రావు గోపాలరావు గారు అత్యున్నతమైన స్థాయిలో ఉన్నారు. అందుకే, ఆయన అంటే కోటకు అభిమానం. ఆ అభిమానం వల్లే.. ఆయనకు ఎదురుగా కింద కూర్చున్నారు.
కానీ, రావు గోపాలరావు గారి కోటను బలవంతంగా కుర్చీలో కూర్చోపెట్టి.. ‘కోటయ్య, నువ్వు గొప్ప నటుడివయ్యా. మా పిల్లలు కూడా నీకే అభిమానులు అయ్యా. సినిమా ఇండస్ట్రీలో నీకు మంచి భవిష్యత్తు ఉందయ్యా. నువ్వు డైలాగ్ లు చెప్పే విధానం ముచ్చటగా ఉంటుంది. ఫైర్ ఇంజన్ గణగణగణమని గంట కొట్టినట్టు నీ మాటలు ఉంటాయి. బోలెడు భవిష్యత్తు ఉన్నోడివి. కాబట్టి, ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ రావు గోపాలరావు గారు వెళ్ళడానికి పైకి లేచారు. కోట ఆయనకు నమస్కారం చేసి ఆయన వైపు అలాగే అభిమానంగా చూస్తూ ఉండిపోయారు.