
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఆయన సోదరుడు పి. సోమశేఖర్ కరోనాతో మృతి చెందడంపై వర్మ భావోద్వేగానికి గురయ్యారు. సహజంగా ఇలాంటి సెంటిమెంట్ లకు అతీతుడు.. అంతగా పట్టించుకోని వర్మ సైతం తన జీవితంలో కీలకమైన వ్యక్తి కోల్పోయాడని ఆవేదన చెందడం గమనార్హం.
కరోనా మహమ్మారి వర్మ సోదరుడిని బలి తీసుకుంది. వర్మతోపాటు సోమశేఖర్ ఎన్నో సినిమాలకు పనిచేశాడు. రంగీలా, డౌడ్, సత్య, జంగల్, కంపెనీ తదితర చిత్రాల నిర్మాణ బాధ్యతలను సోమశేఖర్ దగ్గరుండి చూసుకున్నారు. బాలీవుడ్ లో ప్రవేశించి ‘ముస్కురాకే దేఖ్ జర’ అనే హిందీ సినిమాకు దర్శకత్వం వహించారు.
కాగా సోమశేఖర్ తల్లికి ముందుగా కరోనా వచ్చింది. ఆమెను కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నించి.. ఆమెకు సేవ చేసి తల్లిని బతికించుకున్న సోమశేఖర్ కరోనా బారినపడ్డాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మృతిచెందాడు.
సోదరుడు సోమశేఖర్ మరణంపై వర్మ ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ‘కొన్నేళ్లుగా అతడు మాతో లేడు. ఇతర వ్యాపారాల్లోకి వెళ్లాడు. చాలా కాలంగా మాకు దూరంగా ఉంటున్నాడు. నా జీవితంలో సోమశేఖర్ చాలా కీలకమైన వ్యక్తి. అతడిని చాలా మిస్ అవుతున్నాను’ అని వర్మ తన సోదరుడిని గుర్తు చేసుకొని బాధపడ్డాడు. తల్లిని కరోనానుంచి బతికించి తను బలైపోయాడని ఆవేదన చెందాడు.