తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం.. కొవిడ్ నియంత్రణ చర్యలు తీసుకుంటోంది. ఇటీవల రాష్ట్రంలో ఫీవర్ సర్వే చేపట్టింది. మొత్తం 28 వేల బృందాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఫీవర్ సర్వే నిర్వహించారు. ఈ సర్వే ద్వారా సుమారు 3.5 లక్షల మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్టు వెల్లడించింది.
ప్రధానంగా చాలా మందిలో జ్వరం, జలుబు వంటి లక్షణాలు ఉన్నట్టు గుర్తించామని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి వారందరికీ అత్యవసరంగా కొవిడ్ కిట్లను అందించినట్లు చెప్పారు. తద్వారా.. ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం లేకుండా చేశామన్నారు. కరోనా లక్షణాలు కనిపించగానే చాలా మంది భయపడి పరీక్షా కేంద్రాలకు పరుగులు తీస్తున్నట్టు చెప్పారు. దానివల్ల కూడా.. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాపిస్తోందని చెప్పారు. అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అయితే.. ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో ఫీవర్ సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు.. రాష్ట్రంలో కరోనా అదుపులోకి వచ్చేంత వరకూ ఈ సర్వే నిరంతరంగా కొనసాగించాలని ఆదేశించింది. ఒక దశ ముగియగానే.. మరో దశ మొదలు పెట్టాలని మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్ లక్షణాలు ఉన్న పేషెంట్ల వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచించింది.
కాగా.. మరోసారి సర్వే చేయాల్సి రావడంతో ఆయా బృందాలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 20 శాతం మంది వరకు కొవిడ్ బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి. అలాంటిది మరోసారి సర్వే చేయాల్సి వస్తే.. మరికొంత మందికి వైరస్ వ్యాపింస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే.. మరోసారి సర్వే ఎందుకు చేయిస్తున్నది ప్రభుత్వం వెల్లడించలేదు.