రామ్‌గోపాల్ వర్మ. ఈ పేరు చెబితే గొప్ప గొప్ప సినిమాలు గుర్తొస్తాయి. ఎన్నో చెత్త చిత్రాలూ కళ్ల ముందు కదలాడుతాయి. భారత సినిమా చరిత్రలో గొప్ప దర్శకుల్లో అతని పేరుంటుంది. చెత్త దర్శకుల లిస్ట్‌లో కూడా ముందుంటుంది. ప్రతి రోజూ ఏదో ఒక వివాదాన్ని రాజేసే ఆర్జీవీ ఏం చేసినా సంచలనమే. తన సినిమాలు, ఇంటర్వ్యూలు, ట్వీట్లతో అగ్గిరాజేస్తుంటాడు. సమజంలో జరిగే యాదార్థ సంఘటనల ఇతివృత్తంగా సినిమాలు తీయడంలో ఆర్జీవీని మించిన వాళ్లు లేరు. రక్తచరిత్ర, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు.. అదే కోవలోకి చెందిన చిత్రాలు. బయోపిక్స్ తీయడంలోనూ ఆర్జీవీ దిట్ట. మాఫియా డాన్ల నుంచి రాజకీయ, సినీ ప్రముఖుల వరకూ అందరి జీవితాలను తెరకెక్కించాడు. అయితే, అతని లిస్ట్‌లో ఉన్న ప్రముఖులు అయిపోయినట్టున్నారు. ఇప్పుడు తన జీవితాన్నే సినిమాగా మలుస్తున్నాడు.
తన లైఫ్ ఆధారంగా మూడు పార్టుల బయోపిక్ తీస్తున్నట్టు ఆర్జీవీ ప్రకటించాడు. రాము, రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవీ అనే టైటిల్స్‌తో మూడు పార్టులను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు తెలిపాడు. ఈ బయోపిక్‌ను బొమ్మకు మురళీ నిర్మించనుండగా.. దొరసాయి తేజ డైరెక్ట్ చేయనున్నాడు. రామ్ గోపాల వర్మ తన బయోపిక్‌ను పర్యవేక్షించనున్నాడు. సెప్టెంబర్లో సినిమా షూటింగ్ మొదలవనుంది. ఒక్కో పార్టు నిడివి రెండు గంటలు ఉంటుందని, మూడు పార్టులు కలిపి ఆరు గంటల్లో తన జీవితాన్ని చూస్తారని ఆర్జీవీ చెప్పాడు. 3 పార్టుల్లో ,ఒక్కొక్క పార్టు తన వేరు వేరు వయసుల్లో వేరు వేరు అంశాలను చూపెట్టబోతోంది అన్నాడు. చివరి పార్టులో తానే స్వయంగా నటిస్తానని తెలిపాడు.
‘పార్ట్ 1 లో నా 20 ఏళ్ళప్పుడు రోల్ ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 2 లో వేరే నటుడు, పార్ట్ 3 లో నేనే నాలగా నటించబోతున్నా’ అని ట్వీట్ చేశాడు. ఒక్కో పార్ట్ ఎలా ఉంటుందో వివరించాడు. ‘పార్ట్ 1 “రాము “.. దీంట్లో నా కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నానన్నది ఉంటుంది. పార్ట్ 2 “రామ్ గోపాల్ వర్మ” -అండర్ వరల్డ్ తో ప్రేమాయణం . ఇది నా ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ ,అమితాబ్ బచ్చన్ లతో ఉన్న అనుబంధాల గురించి. పార్ట్ 3 ఆర్జీవీ -ది ఇంటెలిజెంట్ ఇడియట్. ఇది నా ఫేయిల్యూర్లు, వివాదాలు, దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల నాకున్న విపరీత వైఖరుల గురించి’ అని ఆర్జీవీ పేర్కొన్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను మరికొన్ని గంటల్లో రిలీజ్ చేయనున్నాడు.
The first look poster of my biopic is going to release today at 5 PM #RgvBiopic pic.twitter.com/f9G5nWHN1r
— Ram Gopal Varma (@RGVzoomin) August 26, 2020