తెలుగు సినీ చరిత్రలో కామెడీ సినిమాల జోనర్ ను పరిశీలిస్తే.. ముందు వరుసలో నిలిచే సినిమా ‘అహనా-పెళ్లంట’. ఎంత విచిత్రం!! ఈ సినిమా విడుదలై దాదాపు మూడు దశాబ్దాలు దాటినా, ఇప్పటికీ బెస్ట్ తెలుగు కామెడీ సినిమా అంటే ఇదే వస్తోంది. ఈ సినిమా గుర్తుకు రాగానే అందరి ముఖాల్లోనూ నవ్వులు పూస్తున్నాయి. అయితే, ఈ సినిమాలోనే అతి కీలకమైన పాత్ర ‘లక్ష్మీపతి’.
జంధ్యాల ఈ పాత్రను తీర్చిదిద్దిన తీరు అనీర్వచనం. ఈ పాత్ర పండితేనే, సినిమా హిట్, లేదంటే ఫెయిల్యూర్ సినిమా అవుతుంది. అంత కీలక పాత్ర కాబట్టే, ఈ చిత్ర నిర్మాత, ఆ పాత్రను రావుగోపాలరావుతో వేయించాలనుకున్నారు. కానీ జంధ్యాల మాత్రం కోట శ్రీనివాసరావు అనే కొత్త నటుడు ఉన్నాడు. అతను ఈ పాత్రకు బాగుంటాడు అని పట్టుబట్టాడు. దాదాపు 20 రోజుల పాటు రామానాయుడు, జంధ్యాల ఈ విషయంలో పోట్లాడుకున్నారు.
కట్ చేస్తే.. ఎయిర్ పోర్ట్ లో కలిసిన కోటను చూసిన నాయుడుగారు దగ్గరకి పిలిచి, జరిగిందంతా వివరంగా చెప్పుకొచ్చాడు. ‘పోట్లాట ఎందుకండీ?’ అంటూ అప్రయత్నంగా అన్నాడు కోట. “ఆ పాత్ర ఒక పిసినారి పాత్ర అయ్యా. పిసినారి తనానికే పరాకాష్ట పాత్ర. సినిమాకే ఆయువుపట్టు. అందుకే రావుగోపాల్ రావు అయితేనే న్యాయం జరుగుతుంది అని నేనూ,
‘లేదండీ, రావు గోపాల్ రావుగారికి ఎంత మేకప్ చేసినా, ఆయన ఫేస్ లో పూర్ నెస్ రాదండీ’ అంటూ జంధ్యాల. ఈ విషయం మా ఇద్దరి మధ్య తెగట్లేదయ్యా’ అని ఆలోచనలో పడ్డారు నాయుడుగారు. కోటకు ఏమి అర్ధం కావడం లేదు. ఓ చిన్న నటుడు అయిన తనతో ఈ విషయం నాయుడుగారు ఎందుకు చెబుతున్నారు అనే ఆలోచనలతోనే కోట ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు.
అంతలో బాంబ్ పేల్చారు నాయుడుగారు. ‘జంధ్యాల ఆ వేషాన్ని నీతోనే చేయిస్తా అంటున్నాడయ్యా. మరి నువ్వు ఎలా చేస్తావో నీ ఇష్టం, పాత్ర పండేలా నటిస్తే… నీ దశ తిరిగినట్టే’ అని చెప్పి ముగించారు రామానాయుడు . ఆ మాట విన్నాక, ఇది కలో, నిజమో అర్థం కాలేదు కోటకు. నిజం అని అర్ధం అవుతున్నా.. ఎందుకో కోటకు నమ్మకం కలగడం లేదు. ఆ అనుమానంతోనే ఆ సినిమా చేశాడు. ఆ సినిమా కామెడీ క్లాసిక్ గా నిలిచిపోయింది. కోట కెరీర్ టర్న్ అయింది.