
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. కరోనా టైమ్‌లో తెగ కష్టపడుతున్నాడు. లాక్‌డౌన్‌లో మెయిన్ స్ట్రీమ్ సినిమాలు, షూటింగ్స్, థియేటర్లు ఆగిపోగా.. రాము మాత్రం డిజిటల్ మీడియాలో దూసుకెళ్తున్నాడు. వరుస పెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తూ… రోజుల వ్యవధిలో షూటింగ్స్ పూర్తి చేస్తూ..నెట్‌లో రిలీజ్ చేస్తూ తెగ సంపాదిస్తున్నాడు. సోషల్ మీడియాను ఓ రేంజ్‌లో వాడేసుకుంటూ పైసా ఖర్చు లేకుండా తన మూవీస్‌ను ప్రమోట్ చేసుకుంటున్నాడు. కరోనాపై ఓ సినిమా తీస్తున్న ఆర్జీవీ.. ఇప్పటికే ‘క్లైమాక్స్’ ‘నగ్నం’ మూవీస్‌ను తన ఆర్జీవీ వరల్డ్ థియేటర్లో రిలీజ్ చేశాడు. మరో అర డజను చిత్రాలను అనౌన్స్ చేశాడు. అందులో ఒకటి ‘పవర్ స్టార్’ మూవీ. అచ్చం పవన్ కళ్యాణ్‌ను పోలిన ఓ వ్యక్తిని హీరోగా పెట్టి ఈ మూవీ తీస్తున్న ఆర్జీవీ మరో వివాదానికి తెర లేపాడు. రాము నేరుగా చెప్పకపోయినా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ పొలిటికల్ లైఫ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు అర్థమవుతోంది.
Here is the first look poster of POWER STAR film soon to release in RGVWORLDTHEATRE #JaiPowerStar pic.twitter.com/YMbqXyRu2E
— Ram Gopal Varma (@RGVzoomin) July 9, 2020
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు పలు ఫొటోలను ఆర్జీవీ ఈ రోజు సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఎన్నికల తర్వాత కథ అనే ట్యాగ్‌లైన్‌తో పాటు టైటిల్ మధ్య గాజు గ్లాసును కూడా ఉంచాడు. మొన్నటి ఎన్నికల్లో ఇది జనసేన ఎన్నికల గుర్తు కావడం విశేషం. హీరో దిగాలుగా కూర్చొని ఆలోచిస్తున్న ఫొటోతో ఫస్ట్ లుక్ రివీల్ చేసిన వర్మ.. ఆపై, ఇద్దరు అన్నదమ్ములు అంటూ చిరంజీవి, పవన్ కల్యాణ్‌ను పోలి ఉన్న నటుల ఫొటోలను పోస్ట్ చేశాడు. ‘పవర్ స్టార్’ తెల్లటి కుర్తాలో ఉన్న మరో ఫొటో రిలీజ్ చేశాడు. కొద్దిసేపటికే… కళ్ల జోడు, ఓ చేతిలో కాఫీ కప్పు, మరో చేతిలో పుస్తకం, మెడలో ఎర్ర కండువా వేసుకున్న ప్రధాన పాత్ర ధారి ఓ మహిళను చూస్తున్న పోస్టర్ను రిలీజ్ చేశాడు. దీనికి ‘ఫ్రెంచ్ ఆరిజిన్‌కి చెందిన పుస్తకం పాపిలాన్ చదువుతున్న సినిమా లీడ్ క్యారెక్టర్తో ఇండియన్ శారీ కట్టుకున్న ఓ రష్యన్ మహిళ. గోడపై అర్జెంటీనియన్ లెజెండ్ చేగువేరా ఫొటో ఉంది’ అది రాము ట్వీట్ చేశాడు. ఆపై, ఓ డైరెక్టర్తో హీరో మాట్లాడుతుండగా, ఇద్దరి మధ్య గొడవ జరిగిన సందర్భంలోది అంటూ మరో రెండు ఫొటోలు షేర్ చేశాడు. ఇందులో డైరెక్టర్ పాత్ర త్రివిక్రమ్‌ను పోలి ఉంది. అయితే, తన సినిమాలో చూపించే క్యారెక్టర్లు.. నిజ జీవితంలోని కొందరు వ్యక్తులను పోలి ఉంటే అది యాదృచ్ఛికమే అని, అవే నిజమని నమ్మొద్దని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఈ మూవీపై కొందరు అనవసరమైన రద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తున్నారని, సినిమాలో ఏ ఒక్క క్యారెక్టర్ను కూడా తక్కువగా, కించ పరిచేలా చూపించనని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నానని చెప్పాడు. కాగా, ఈ చిత్రాన్ని కూడా ఆర్జీవీ థియేటర్ వరల్డ్‌లో విడుదల చేస్తానని ప్రకటించాడు.
Two brothers in a moment from my film POWER STAR pic.twitter.com/Q66pktqCah
— Ram Gopal Varma (@RGVzoomin) July 9, 2020