
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘ఆర్జీవీ దెయ్యం’. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన వర్మ.. తాజాగా మీడియాతో ముచ్చటించారు. అయితే.. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆర్జీవీ సమాధానాలు ఇచ్చారు.
‘వకీల్ సాబ్ చిత్రాన్ని చూశారా?’ అన్న ప్రశ్నకు.. వకీల్ సాబ్ సినిమా చూడలేదుగానీ.. ట్రైలర్ చూశానని, చాలా బాగా నచ్చిందని చెప్పారు ఆర్జీవీ. ఆ సినిమాకు వచ్చిన రివ్యూలు కూడా చూశానని తెలిపారు. ఇక, పవన్ కల్యాణ్ తో భవిష్యత్ లో సినిమా చేసే ఆలోచన ఉందా? అనే ప్రశ్నకు సైతం ఆయన బదులిచ్చారు.
‘పవన్ తో సినిమా చేయాలనుకున్నప్పుడు.. ఆయన భారీ ఇమేజ్, హీరోయిజాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్, అభిమానుల అంచనాలను అన్నింటినీ లెక్కలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మేనేజ్ చేయడం నాకు చేతకాదు. ఎందుకంటే.. నేను జోనర్ సినిమాలు చేసుకుంటూ వెళ్తాను.’ అని చెప్పారు.
తన జోనర్ సినిమాల్లోకి స్టార్ హీరోలను తీసుకుంటే కుదరదు. అది వారి కూడా మంచిది కాదని చెప్పారు. ఇక, కమర్షియల్ హంగులతో సినిమాలు తీయాలనే ఉద్దేశం కూడా తనకు లేదని చెప్పారు ఆర్జీవీ. కాగా.. ఆర్జీవీ దెయ్యం సినిమాలో రాజశేఖర్, స్వాతి దీక్షిత్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే పాన్ ఇండియా మూవీగా అన్ని ప్రధాన భాషల్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.