Ram Gopal Varma : 2018 వ సంవత్సరం లో చెక్ బౌన్స్ అయ్యినందుకు గానూ రామ్ గోపాల్ వర్మ పై ఫిర్యాదు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు పై ముంబై లోని అంథేరీ కోర్టు నేడు తుది తీర్పుని ఇస్తూ, రామ్ గోపాల్ వర్మకి 3 నెలల జైలు శిక్షతో పాటు, ఫిర్యాదుదారునికి 3.7 లక్షల రూపాయిలు పరిహారం చెల్లించాలని, పరిహారం చెల్లించని పక్షంలో మరో మూడు నెలల జైలు శిక్షకు శిక్షార్హుడు అవుతాడని కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దీనిపై కాసేపటి క్రితమే రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘అంథేరీ కోర్టు నాకు విధించిన జైలు శిక్షపై వివరాలు చెప్పాలని అనుకుంటున్నాను. ఏడేళ్ల క్రితం నాకు, నా మాజీ ఉద్యోగికి మధ్య జరిగిన వ్యవహారమిది. ఈ కేసు విషయంలో నాకు సంబంధించిన న్యాయవాదులు విచారణ జరిగినప్పుడల్లా కోర్టుకు హాజరు అవుతున్నారు. కోర్టు కేసు కారణంగా ఇంతకీ మించి ఈ అంశంపై నేను ఎలాంటి వివరాలు ఇవ్వలేను’ అంటూ చెప్పుకొచ్చాడు రామ్ గోపాల్ వర్మ.
మహేష్ చంద్ర అనే వ్యక్తి గత ఏడేళ్లుగా కోర్టులో న్యాయం కోసం పోరాడుతున్నాడు. మొత్తానికి ఆయన పోరాటానికి ప్రతిఫలం లభించింది. అయితే రామ్ గోపాల్ వర్మ అంత తేలికగా తన ఓటమిని ఒప్పుకునే రకం కాదు. అంత తేలికగా ఒప్పుకునే పని అయితే ఇంత దూరం ఎందుకు తెచ్చుకుంటాడు?, కోట్లు సంపాదించే రామ్ గోపాల్ వర్మ కి మూడు లక్షల 70 వేలు ఒక లెక్కా చెప్పండి?, అసలు ఎందుకు ఆయన ఈ చిన్న అమౌంట్ పై ఇంత మొండిపట్టు పట్టాడు. అసలు ఏమి జరిగింది, ఎందుకు ఇలా మహేష్ చంద్ర పై కఠినంగా వ్యహరిస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లపై గతంలో మార్ఫింగ్స్ చేసినప్పటికీ కూడా ఆయనపై ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోయారు పోలీసులు.
అలాంటిది 7 ఏళ్ళ క్రితం నమోదైన కేసుకి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ అవ్వడం అందరినీ షాక్ కి గురి చేసింది. ఇకపోతే రీసెంట్ గానే ఆయన తన పాత సినిమా ‘సత్య’ ని చూసి ట్విట్టర్ లో చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎలా ఉండే నేను ఎలా అయిపోయాను అంటూ బాధపడ్డాడు. ఇక నుండి సత్య రేంజ్ సినిమాలు చేయకపోయినా, తన గౌరవాన్ని పెంచే సినిమాలు మాత్రమే చేస్తానని ఒట్టేసుకున్నాడు. అందులో భాగంగానే ‘సిండికేట్’ అనే చిత్రాన్ని ప్రకటించాడు. ఈ సినిమాతో తనలోని వింటేజ్ డైరెక్టర్ ని బయటకి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. ఇంతలోపే ఆయన అరెస్ట్ కాబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలను చూసి ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. మరి ఆయన అరెస్ట్ అవుతారా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది.