Ram Charan: టైటిల్ ని చూడగానే, ఢిల్లీ లో రామ్ చరణ్(Global Star Ramcharan) కి ఏమి పని?, కొంపదీసి ఈయన కూడా రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడా ఏమిటి? అని మీకు అనిపించి ఉండొచ్చు. ఎందుకంటే ఈమధ్య కాలంలో ఢిల్లీ రాజకీయాలు ఆ రేంజ్ లో వేడెక్కించాయి మరి. ఢిల్లీ పేరు వింటే రాజకీయాలు తప్ప జనాలకు మరొకటి గుర్తు వచ్చే పరిస్థితులు లేవు. అయితే మీరు అనుకుంటున్నట్టు రామ్ చరణ్ రాజకీయాల కోసం ఢిల్లీ కి రావడం లేదు. తన సినిమా షూటింగ్ కోసం ఢిల్లీ కి వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు(Buchi Babu Sana) తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు(మీర్జాపూర్ మున్నా) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
రెగ్యులర్ షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ సినిమా, లేటెస్ట్ గా హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. తదుపరి షెడ్యూల్ ని మార్చి మొదటి వారం లో ఢిల్లీ లో ప్రారంభించనున్నారు మేకర్స్. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ తో పాటు, ప్రధాన తారాగణం మొత్తం పాల్గొననుంది. రెండవ షెడ్యూల్ లో రామ్ చరణ్, దివ్యేందు మధ్య క్రికెట్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. మూడవ షెడ్యూల్ లో కుస్తీ ఫైట్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో క్రికెట్, కుస్తీ లతో పాటు మరికొన్ని కీలకమైన ఆటలను ఆధారంగా చేసుకొని సన్నివేశాలు ఉంటాయి. రామ్ చరణ్ ఈ చిత్ర లో అన్ని ఆటల్లో ఆరితేరిన నిష్ణాతుడిలాగా కనిపించబోతున్నాడు. ఆయనకు గురువు గా శివరాజ్ కుమార్ నటించనున్నాడు. ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్ ని పెట్టే ఆలోచనలో ఉన్నాడట డైరెక్టర్. ఆ టైటిల్ తో పాటు మరో రెండు టైటిల్స్ ని కూడా పరిశీలిస్తున్నారట.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ని ఫస్ట్ లుక్ ని విడుదల చేయబోతున్నారట. ఎట్టిపరిస్థితిలోను షూటింగ్ కార్యక్రమాలను అనుకున్న ప్లాన్ ప్రకారం పూర్తి చేసి, ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇందులో రామ్ చరణ్ మరోసారి తన నటవిశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. నా కెరీర్ లో ఇది రంగస్థలం చిత్రాన్ని మించినది గా ఉంటుందని, నా క్యారక్టర్ ని ఎప్పుడెప్పుడు వెండితెర మీద చూసుకుంటానా అని ఎదురు చూస్తున్నానని రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ మూవీ ప్రొమోషన్స్ లో ఈ సినిమా ప్రస్తావన వచ్చినప్పుడు చెప్పుకొచ్చాడు. మరి ఆ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందో లేదో చూడాలి. ఈ చిత్రానికి డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) కథని అందించాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.