Ram Charan Buchi Babu: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ #RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఆయన సినిమా కోసం కేవలం మెగా అభిమానులు, తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు, ఇక నుండి ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. టైటానిక్, అవతార్ వంటి వెండితెర దృశ్య కావ్యాలను తెరకెక్కించిన జేమ్స్ కెమరూన్ లాంటి దర్శకులు కూడా రామ్ చరణ్ నటనకు ఫిదా అయ్యారంటే ఆయన క్యాలిబర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రామ్ చరణ్ కి సరైన బ్లాక్ బస్టర్ పడితే రికార్డ్స్ విషయం లో ఆయనకి పోటీ ఇచ్చేవాళ్ళు లేరని ట్రేడ్ పండితులు సైతం చెప్పే మాట. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం ఆయన సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేసిన ‘గేమ్ చేంజర్’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. క్రిస్మస్ లేదా సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
ఈ దసరా కి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన రెండు పాటలకు ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ బుచ్చి బాబు దర్శకత్వం లో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కూడా ఈ నెలలోనే ప్రారంభం కాబోతుంది. అభిమానులు ‘గేమ్ చేంజర్’ చిత్రం కంటే ఎక్కువగా ఈ సినిమా మీదనే అంచనాలు పెట్టుకున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈమె ‘దేవర’ చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. అందం లోనూ, నటనలోనూ డ్యాన్స్ లోనూ ఈమె తెలుగు ఆడియన్స్ చేత శబాష్ అనిపించుకుంది.
ఇక ఈ చిత్రం లో ఆమెకు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రనే దక్కిందట. అలాగే ఈ చిత్రం లో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఒక కీలక పాత్ర పోషించబోతున్నాడు, తమిళ స్టార్ హీరో సూర్య కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తాడని టాక్ ఉంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమా కథ రాయడానికి దాదాపుగా 3 కోట్ల రూపాయిలను ఖర్చు చేసాడట డైరెక్టర్ బుచ్చి బాబు. రచయితగా మంచి అనుభవం ఉన్నవాళ్లను తన బృందం లోకి తీసుకున్నాడట. దీని మీద ఆయన ఎన్నో పరిశోధనలు కూడా చేసాడట. రామ్ చరణ్ క్యారక్టర్ ని డిజైన్ చేసేందుకు చాలా కష్టపడినట్టు తెలుస్తుంది. ఆయన నటన ఇందులో ‘రంగస్థలం’ ని మించి ఉంటుందని సమాచారం. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. రామ్ చరణ్ కూడా తన లుక్ ని పూర్తిగా మార్చేశాడు.