Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మరణంతో ఆయన అభిమానులు షాక్ కు గురయ్యారు. ఆయన వద్ద డ్యాన్స్ నేర్చుకున్నవాళ్లంతా రాకేష్ పార్థివ దేహాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో డ్యాన్సర్ గా గుర్తింపు పొందిన రాకేష్ ఎంతో మంది హీరోలకు డ్యాన్స్ నేర్పారు. మొత్తంగా ఆయన 1500 సినిమాల్లో పనిచేసినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో రాకేష్ మృతికి సంతాపంగా కొందరు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన రాకేష్ మాస్టర్ పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఆయనను చివరి చూపు చూసేందుకు అభిమానులు తరలివస్తున్నారు. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి రాకేష్ పార్థివ దేహాన్ని దర్శించడానికి ఒక్కరూ రాలేదని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు.
రాకేష్ మాస్టర్ 1968లో జన్మించారు. ఈయనకు నలుగురు అక్కలు, ఒక తమ్ముడు ఉన్నారు. హైదరాబాద్ లోని ముక్కురాజు మాస్టర్ వద్ద కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత వేణు, మణిచందన, ప్రభాస్, ప్రత్యూష వంటి నటులకు డ్యాన్స్ నేర్పారు. ఆ తరువాత దేవదాసు, చిరునవ్వుతో, సీతయ్య వంటి సినిమాలకు పనిచేశాడు. ఈటీవీ వేదికగా ప్రారంభమైన డ్యాన్స్ షో కు ఢీ లో బషీర్ అనే కుర్రాడికి మాస్టర్ గా వ్యవహరించాడు.
అయితే రాకేష్ మాస్టర్ ముక్కుసూటి వ్యక్తి. ఆయన అనేక వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు. అలా చేయడంతో ఆయనకు సినిమాల్లో అవకాశాలు తగ్గాయని చాలా మంది అంటూంటారు. ఒకప్పుడు కార్లలో తిరిగే ఆయన సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో ఇప్పుడు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. చివరిగా ఆయన హనుమాన్ అనే సినిమాల్లో నటించారు. ఈ సమయంలో ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు.
రాకేష్ మాస్టర్ మరణం తరువాత ఆయన పార్థివ దేహాన్ని ఇంట్లో ఉంచారు. ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ రాలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఆయన బతికి ఉన్నన్నాళ్లు ఎవరూ అవకాశాలు ఇవ్వలేదని, ఇప్పుడు చనిపోయిన తరువాత కనీసం సంతాపం వ్యక్తం చేయడం లేదని అంటున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.