Anukoni Prayanam Movie Review: తారాగణం: డాక్టర్ రాజేంద్రప్రసాద్, నరసింహారాజు, ప్రేమ, తులసి, రవిబాబు, శుభలేఖ సుధాకర్ తదితరులు. దర్శకుడు: వెంకటేష్ పెదిరెడ్ల
నిర్మాత: డా. జగన్మోహన్
సంగీతం: శివ దీనవహి
సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్
ఎడిటర్: రాము

రాజేంద్రప్రసాద్.. సోలో హీరోగా ఎప్పుడో ఫేడ్ అవుట్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత ఆ స్థాయిలో ఆయన చెప్పుకోదగ్గ పాత్ర ఏది పడలేదు. అయితే చాలా కాలం తర్వాత ఆయన ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా “అనుకోని ప్రయాణం”.. ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. దీనిపై కాస్త హైప్ క్రియేట్ చేసేందుకు ‘నా 45 ఏళ్ల నటజీవితంలో గుర్తుపెట్టుకునే సినిమాల్లో అత్యద్భుతమైన దృశ్య కావ్యం అనుకోని ప్రయాణం ఒకటి అంటూ” ఇటీవల వ్యాఖ్యానించారు.. ఆయన చెప్పినట్టు ఈ “అనుకోని ప్రయాణం”లో అంత గొప్పగా ఏముంది? ఆ ప్రయాణం సాఫీగా సాగిందా? లేక ఒడిదుడుకులకు లోనయిందా?
కథ ఏమిటంటే..
రాజేంద్రప్రసాద్ ( ఈ సినిమాలో ఈ పాత్రకు పేరే లేదు) రాజు(నరసింహారాజు) మంచి స్నేహితులు. ఒడిశాలోని భువనేశ్వర్ లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ ఉంటారు. నరసింహ రాజు కుటుంబం రాజమండ్రికి సమీపంలోని ఓ గ్రామంలో నివసిస్తూ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ ఒంటరి. ఇద్దరు స్నేహితులు హాయిగా పని చేసుకుంటూ కాలం గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా నరసింహారాజు గుండెపోటుతో మరణిస్తాడు. అదే సమయంలో కోవిడ్ వల్ల లాక్ డౌన్ పడుతుంది. స్నేహితుడి చివరి కోరిక మేరకు రాజేంద్రప్రసాద్ అతని మృతదేహాన్ని రాజమండ్రి తరలించాలి. మరి లాక్ డౌన్ సమయంలో ఈ పని ఎలా చేశాడు? ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.
సినిమా ఎలా ఉంది అంటే
కోవిడ్ సమయంలో గుండెను మెలిపెట్టే హృదయ విదారక సంఘటనలు చాలా చూశాం.. ఎదుటి మనిషిని పలకరించేందుకే చాలామంది భయపడ్డారు. చావులైతే మరీ దారుణం. అలాంటి ఓ చావుకు సంబంధించిన కథ ఇది. కోవిడ్ నేపథ్యంలో “మంచి రోజులు వచ్చాయి” అనే పేరుతో మారుతి ఒక సినిమా తీసినప్పటికీ అది పెద్దగా కనెక్ట్ కాలేదు. ఇక భువనేశ్వర్ లో రాజు మృతదేహాన్ని రాజమండ్రి తీసుకురావాలి. కోవిడ్ సమయంలో అలా చేయడం చాలా ఇబ్బంది కరం. దీనినే కథగా మలిచారు. అయితే ఈ కథను ట్రీట్ చేసిన విధానం మాత్రం అవుట్ డేటెడ్ గా అనిపిస్తుంది. గుండెలు బాదుకునే ఎమోషన్ సీన్స్ కి కాలం చెల్లిపోయిన రోజులు ఇవి. క్రైమ్, థ్రిల్లర్, డిటెక్టివ్, సస్పెన్స్, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లకు, కథలకు బ్రహ్మరథం పడుతున్న రోజులు ఇవి. గుండెలు బాదుకునే ఎమోషన్ ఉన్నప్పటికీ ఎంటర్టైన్మెంట్ అనే కోటింగ్ లేకుంటే అది వృధా ప్రయత్నం. కోవిడ్ పేరును తలుచుకునేందుకు కూడా ఇప్పుడు జనాలు చిరాకు పడితే స్థితికి వచ్చారు. అలాంటిది ఆ సమయంలో జరిగిన ఒక దారుణమైన సంఘటనను సినిమాగా తీసి చూడండి అని చెబితే అంత హెవీ పెథాస్ డ్రామా చూసే మూడ్ ఇప్పుడు ఎవరికీ లేదు. కొత్త దర్శకుడు వెంకటేష్ మెలో డ్రామటిక్ కాస్త లైట్ చేసేందుకు కామెడీ ట్రాక్ వాడాడు.. అయితే ఆ కామెడీ కథ పై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. అదేదో జబర్దస్త్ స్కిట్ వ్యవహారంలా కనిపించింది. వాస్తవానికి ఇలాంటి బరువైన కథకు కామెడీ అతకదు. కోవిడ్ సమయంలో ప్రజల మూడ్ కామెడీ లా లేదు.. అయితే కొత్త దర్శకుడు ఇలాంటి ఒక హెవీ డ్రామా ఉన్న పాయింట్ ఎత్తుకోవడం, చివరి చూపు, సొంత ఊరు, ఎమోషన్స్.. చెప్పుకునేందుకు ఇవన్నీ బాగున్నప్పటికీ వాటిని స్క్రీన్ పైకి తెచ్చిన తీరు మాత్రం ఏ మాత్రం ఆకట్టుకోదు.
ఎలా చేశారంటే
రాజేంద్రప్రసాద్ నటన ఈ సినిమాకి ప్రధాన బలం. చాలా రోజుల తర్వాత ప్రేమ ఇందులో కనిపించింది. అయితే ఆమె పాత్ర కూడా పరిధి మేరకే ఉంది. నరసింహారాజు తన అనుభవం చూపించారు.. తులసి, రవి బాబు, ధనరాజ్, శుభలేఖ సుధాకర్, ప్రభాస్ శ్రీను వారి వారి పరిధి మేరకు చేశారు.
సాంకేతిక వర్గం
మల్లికార్జున్ సినిమాటోగ్రఫీ బాగుంది.. శివ సంగీతం ఓకే అనిపిస్తుంది. శంకర్ మహదేవన్ పాడిన పాట గుండెకు అతుక్కుంటుంది.. ఎడిటర్ ఇంకా ఈ సినిమాను కర్తరించాల్సి ఉంది. నిర్మాణ విలువలు బడ్జెట్ పరిధిలో ఉన్నాయి..

ప్లస్ పాంట్స్
రాజేంద్రప్రసాద్
ఎంచుకున్న కథ
మైనస్ పాంట్స్
హెవీ ఎమోషనల్ డ్రామా
అవుట్ డేటెడ్ ట్రీట్మెంట్
చివరగా: ఈ ప్రయాణం ప్రేక్షకుడికి మరింత భారం.
రేటింగ్: 2.5/5