Director Rajamouli: ‘బాహుబలి’ సినిమా తరువాత రాజమౌళి రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. ఆయన ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో మరో పెద్ద గిఫ్ట్ ను రాజమౌళి అనుకోకుండా ఇచ్చారు.
హైదరాబాద్ లోని ఛాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రికెటర్ కపిల్ దేవ్, దర్శకుడు రాజమౌళి, డాక్టర్ రవి తంగరాల పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో మాట్లాడిన రాజమౌళి… ముందుగా కపిల్ దేవ్ పై తన ప్రేమను తెలియజేశాడు. కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచిన మ్యాచ్ ను లైవ్ లో చూడకపోయినా… గాల్లో ఉన్న బంతిని కపిల్ క్యాచ్ అందుకున్న క్షణాన తమ గుండె ఆగిపోయినంత సంతోషం, ఉద్వేగం కలిగిందని అన్నారు రాజమౌళి. అయితే ఇక్కడే కపిల్ దేవ్ గురించి చెబుతూ అనుకోని రీతిలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఓ డైలాగ్ ను అభిమానులతో పంచుకున్నారు జక్కన్న. ” నువ్వు చేసేది ధర్మయుద్ధమైతే… ఆ యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి” అని చెప్పారు. ఈ డైలాగ్ కి కార్యక్రమంలో అరుపులు, కేకలు వినిపించాయి. అయితే సినిమాలో ఈ డైలాగ్ ఏ క్యారెక్టర్ తో పలికిస్తారో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.