Rajamouli: సినిమా అనేది అత్యంత శక్తివంతమైన మాధ్యమం. అందువల్లే సినిమాలో నటించే వారికి, సినిమాలను తీసే వారికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది. ఎక్కడో హాలీవుడ్లో సినిమాలు తీసే స్పిల్ బర్గ్ కు భారత్లోని మారుమూల గ్రామాల్లో అభిమానులు ఉంటారు. ఎక్కడో తెలుగు రాష్ట్రాల్లో RRR అనే ఓ సినిమా తీస్తే ఎస్ఎస్ రాజమౌళికి జపాన్ లో ఏకంగా అభిమాన సంఘాలే ఏర్పడ్డాయి. ఒక మనిషిని కదిలించగల శక్తి సాహిత్యానికి ఉంటే.. ఒక సమూహాన్ని ప్రేరేపించగల బలం సినిమాకు ఉంటుంది. అందువల్లే సినిమాలో నటించిన వారు, సినిమాలు తీసినవారు ఆరాధ్య దైవాలుగా వెలుగొందుతున్నారు. అలాంటివారు తమ కళ్ళ ముందు కనిపిస్తే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఇక్కడ మాత్రమే కాదు ఇతర దేశాల్లో కూడా ఆయనకు అదే స్థాయిలో ఆదరణ ఉంది. విదేశాల్లో అభిమానులు తనపై ఎంత ప్రేమ చూపిస్తున్నారో.. వారి ప్రేమను ఎలా కదిలించిందో.. రాజమౌళి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.
రాజమౌళి ప్రస్తుతం తన సతీమణి రమతో కలిసి జపాన్ లో ఉన్నారు. గత ఏడాదే RRR సినిమాను జపాన్ భాషలో విడుదల చేశారు. అప్పట్లో ఆ సినిమా ప్రమోషన్ కు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్, రాజమౌళి కుటుంబాలతో సహా వెళ్లారు. ఆ సినిమా అక్కడి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంది. భారత్ లో మాదిరిగానే అక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ముఖ్యంగా నాటు నాటు పాట అక్కడి ప్రజలను సమ్మోహనులను చేసింది. దీంతో అక్కడ చాలామంది రాజమౌళికి అభిమానులుగా మారిపోయారు. ప్రస్తుతం జపాన్ లో ఉన్న రాజమౌళికి అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముఖ్యంగా ఓ 80 ఏళ్ల వృద్ధురాలు తన ప్రేమను, అభిమానాన్ని రాజమౌళి ఎదుట వ్యక్తపరిచింది. ఆమె ప్రేమకు రాజమౌళి పొంగిపోయారు.. అందుకు సంబంధించిన ఫోటోలను తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశారు.
జపాన్ లో ఓరిగామి క్రేన్ అనే ఓ సంప్రదాయం ఉంటుంది. తమకు ఇష్టమైన వారి కోసం, వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వీటిని తయారు చేస్తారు. నూతన సంవత్సర సందర్భంగా మనం ఎలా అయితే గ్రీటింగ్ కార్డులు ఇస్తామో.. వారు కూడా ఓరిగామిక్రేన్ లు అందజేస్తారు. జపాన్ లోని 83 సంవత్సరాల వృద్ధురాలు.. రాజమౌళికి కూడా అలాంటి ఓరిగామిక్రేన్ ను అందించింది. ” RRR సినిమాలోని నాటు నాటు పాట నాకు ఎంతో ఇష్టం. ఇప్పటికే ఎన్నోసార్లు చూశాను. రోజూ ఆ పాటను చూడందే నా దినచర్య పూర్తి కాదంటూ” ఆ వృద్ధురాలు పేర్కొంది. ఓరిగామిక్రేన్ లో RRR చిత్రానికి సంబంధించిన కొన్ని దృశ్యాలను ఫోటోల రూపంలో పొందుపరిచింది. దానిని రాజమౌళికి అందించింది. ఆమె ప్రేమకు అంతటి దిగ్దర్శకుడు ఫిదా అయ్యాడు.