Varanasi movie: రాజమౌళి సినిమా అంటేనే ప్రేక్షకులకు అమితాసక్తి ఉంటుంది. అలాంటిది ఆయన అడ్వెంచర్ , టైం ట్రావెల్, రామాయణం వంటి కాన్సెప్ట్స్ ని కలిపి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుంది?, హైప్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించడం కూడా కష్టమే . అలాంటి హైప్ ప్రతిరూపమే ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ చిత్రం. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫారిన్ భాషల్లో విడుదల కాబోతుంది. అక్టోబర్ నెలలోపు షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేస్తామని ఇప్పటికే రాజమౌళి ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు. ఇకపోతే రీసెంట్ గానే ఆయన ‘ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్’ లో పాల్గొన్నారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్ లో రాజమౌళి ‘వారణాసి’ గురించి మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆయన మాట్లాడుతూ ‘మా వారణాసి సినిమాలో ఆఫ్రికా అడవుల్లో ఉండే జంతువుల క్రూరత్వం తో పాటు, అంటార్కిటికాలోని మంచు పర్వతాల్లో ఉండే చల్లదనం కూడా చూపించబోతున్నాము. రామాయణం లోని పాత్రలు , మధ్యలో ప్రకృతి విలయాలు , టైం ట్రావెల్ వంటి కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. ముఖ్యంగా ఈ చిత్రంలో ఫాంటసీ తో ముంచెత్తే అద్భుతమైన విన్యాసాలు ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తాయి. వీటి అన్నిటికంటే తండ్రి కొడుకుల మధ్య ఉండే అద్భుతమైన అనుభందం , వారి మధ్య ఏర్పడే భావోద్వేగాలు ఈ కథకు మూలం. అక్కడి నుండే ఈ సినిమా ఫాంటసీ జర్నీ మొదలు అవుతుంది’ అంటూ చెప్పుకొచ్చారు రాజమౌళి. మహేష్ బాబు ఇది వరకు ప్రకాష్ రాజ్ తో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా దూకుడు చిత్రం లో వీళ్లిద్దరు తండ్రి కొడుకులుగా ఎంత అద్భుతంగా నటించారో మనమంతా చూసాము.
మళ్లీ ఇన్ని రోజులకు వీళ్లిద్దరి మధ్య ప్రేమానుబంధాలను వెండితెర పై గ్రాండ్ స్కేల్ లో చూసే అదృష్టం ఆడియన్స్ కి కలగబోతుంది. ఇందులో మహేష్ బాబు తన తండ్రి ప్రకాష్ రాజ్ ఆశయాన్ని ఛేదించడానికి ఎంత దూరమైనా వెళ్లే కొడుకు పాత్రలో కనిపించబోతున్నారు. అందుకోసం ఆయన కాలాన్ని కూడా దాటాల్సి వస్తుంది. అందుకు ఎదురయ్యే పరిస్థితులను ఈ చిత్రం లో మనమంతా చూడబోతున్నాము. అక్టోబర్ నెలలో షూటింగ్ ని పూర్తి చేసి , డిసెంబర్ నుండి నాన్ స్టాప్ గా ప్రొమోషన్స్ చెయ్యాలని రాజమౌళి ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. దాదాపుగా 2000 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆడియన్స్ ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ చిత్రం లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా , మలయాళం స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.
